'వివేక్‌ వెంటనే రాజీనామా చేయాలి'

11 Jan, 2018 14:26 IST|Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్ష పదకి జి. వివేక్‌ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వివేక్‌ హెచ్‌సీఏలో కొనసాగడానికి ఎంతమాత్రం అర్హత లేదన్నారు. తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌(టీసీఏ)కి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు అనుమతి ఇచ్చే విషయంలో అడ్డుకుంటామని వివేక్‌ స్వయంగా చెప్పడం  నిజంగా సిగ్గుచేటన్నారు. ఇలా చెప్పడం తెలంగాణ యువతను క్రికెట్‌ దూరం చెయ్యడం కాదా.. అని అరుణ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు జరిగిన తరువాత టీసీఏ..బీసీసీఐ అనుమతి కోసం యత్నంచడంలో తప్పేముందని అరుణ నిలదీశారు. ఈ సందర్భంగా టీసీఏను 1986లో పాల్వాయి గోవర్ధన్‌ స్థాపించిన సంగతిని గుర్తు చేశారు.

అదే సమయంలో హెచ్‌సీఏ ఏనాడూ గ్రామీణ ప్రాంతాల్లో టోర్నమెంట్‌ నిర్వహించి, ప్రోత్సహకాలు అందించిన దాఖలాలు లేవని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా హెచ్‌సీఏ గ్రామాల్లోకి వెళ్లిన దాఖలాలు లేవని మండిపడ్డారు. టీసీఏపై హెచ్‌సీఏ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని అనడానికి వివేక్‌ వ్యాఖ్యలు ఉదాహరణగా ఆమె పేర్కొన్నారు. హెచ్‌సీఏపై లెక్కలేనటువంటి ఆరోపణలున్నాయని, రూ. 140 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీలో కేసులో ఉన్నాయన్నారు. ఇక్కడ జరపని టోర్నమెంట్లను జరిపినట్లు చూపిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని డీకే అరుణ దుయ్యబట్టారు.

ఇదిలా ఉంచితే, తెలంగాణలో మహిళా క్రికెటర్లకు ఎంతమాత్రం ప్రోత్సాహం లేదని,  దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల యువతి, యువకులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు టీసీఏ కంకణం కట్టుకుని పనిచేస్తోందన్నారు. హెచ్‌సీఏలో వివేక్‌ కుటుంబ పాలన కొనసాగిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. హెచ్‌సీఏ అవినీతిపై అసెంబ్లీలో చర్చకు తీసుకొస్తామని హెచ్చరించిన అరుణ.. హెచ్‌సీఏలో ఏమి జరిగినా జవాబు చెప్పాల్సిన బాధ్యత వివేక్‌పై ఉందన్నారు. టీసీఏకి త్వరలో బిసిసిఐ అనుమతి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.  టీసీఏ కి వస్తున్న ఆదరణ ఓర్వలేక వివేక్‌ ఆరోపణలకు దిగుతున్నారని అరుణ ఆరోపించారు. హెచ్‌సీఏలో తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న వివేక్‌ దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజీనామా చేయాలన్నారు.
 

మరిన్ని వార్తలు