న్యాయ పోరాటానికి సిద్ధం

7 Jul, 2018 10:11 IST|Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు తనకు అర్హత లేదంటూ అంబుడ్స్‌మన్‌ ఇచ్చిన తీర్పుపై న్యాయపోరాటం చేస్తానని జి.వివేకానంద్‌ ప్రకటించారు. దీనిపై హైకోర్టులో అప్పీల్‌కు వెళుతున్నట్లు, వీలైనంత తొందరగా తనకు న్యాయం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం వివేకానంద్‌ ప్రెస్‌ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. లోధా సూచనల ప్రకారం తాను అన్ని వివాదాస్పద అంశాలపై అంబుడ్స్‌మన్‌ నరసింహారెడ్డికి ముందే స్పష్టత ఇచ్చానని... అయితే ఆయన తన వివరణను పరిగణనలోకి తీసుకోకుండా ప్రత్యర్థి వర్గానికి అనుకూలంగా వ్యవహరించడం దురదృష్టకరమని వివేక్‌ అన్నారు. ప్రధానంగా రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ తనపై అనర్హత వేటు వేశారన్న మాజీ ఎంపీ, ఆ రెండూ తనకు వర్తించవని స్పష్టం చేశారు. ‘లాభదాయక పదవిలో ఉంటున్నానని, కేబినెట్‌ హోదా ఉందని అంబుడ్స్‌మన్‌ తీర్పులో ఉంది. అయితే నేను ఏనాడూ ప్రభుత్వ పదవి కోసం ప్రమాణ స్వీకారం చేయలేదు. కేబినెట్‌లో లేను. అది నిజమైతే ఎన్నికల సమయంలోనే రిటర్నింగ్‌ అధికారి నా దరఖాస్తును తిరస్కరించేవారు. హెచ్‌సీఏ నియమావళిలో కూడా దీని గురించి ఎక్కడా లేదు.

రెండోదైన పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఘర్షణ (కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌) పరిధిలో కూడా నేను లేను. ఎందుకంటే హెచ్‌సీఏ, విశాక ఇండస్ట్రీస్‌ మధ్య ఒప్పందం 2016లోనే ముగిసింది కాబట్టి ఇప్పుడు నేను విశాక ద్వారా ఎలాంటి లాభం పొందడం లేదు’ అని వివేక్‌ వెల్లడించారు. గురువారం లోధా కమిటీ సిఫారసులపై వాదనల సందర్భంగా ఎవరెవరు అనర్హులు అవుతారో అనే దానిపై సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది కాబట్టి దాని ఆధారంగా హైకోర్టులో తాజాగా పోరాటానికి సిద్ధమైనట్లు వివేక్‌ తెలియజేశారు. ఒకప్పుడు రూ. 4.3 కోట్లు ఇచ్చిన తమతో హెచ్‌సీఏ ఒప్పందాన్ని ఉల్లంఘించి, ఆ తర్వాత నష్టపరిహారంగా రూ. 17.5 కోట్లు చెల్లిస్తామని కోర్టులోనే పిటిషిన్‌ దాఖలు చేసింది కాబట్టి విశాక–హెచ్‌సీఏ ఒప్పందం ముగిసిన అధ్యాయమని వివేక్‌ వ్యాఖ్యానించారు. హెచ్‌సీఏలో అవినీతికి అలవాటు పడిన వారిని కాదని సొంత డబ్బులతో ఆట అభివృద్ధికి కృషి చేస్తున్న తనను విమర్శించడంలో అర్థం లేదని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు