వైజాగ్‌కు టెస్టు హోదా తెప్పిస్తాం!

1 Oct, 2013 01:54 IST|Sakshi

విజయవాడ స్పోర్ట్స్/గుంటూరు, న్యూస్‌లైన్: విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంకు త్వరలో టెస్ట్ హోదా వస్తుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి గోకరాజు గంగరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఐసీసీ ప్రతినిధుల పరిశీలన పూర్తయ్యిందని, త్వరలో బీసీసీఐ టెక్నికల్ కమిటీ  పరిశీలన కూడా పూర్తయితే వైజాగ్‌కు టెస్టు హోదా లభిస్తుందని ఆయన అన్నారు.
 
  బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ చైర్మన్‌గా ఎంపికైన అనంతరం ఆయన సోమవారం ఇక్కడి ఏసీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారత్-వెస్టిండీస్ మధ్య త్వరలో జరిగే వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్‌ను విశాఖకు కేటాయించే అవకాశం ఉందని గంగరాజు వెల్లడించారు. గుంటూరు జేకేసీ కళాశాలలో ప్రస్తుతం ఏసీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా క్రికెట్ అకాడమీకి బీసీసీఐ గుర్తింపు ఇచ్చిందని, ఇకపై నేరుగా బోర్డు ఇక్కడి కార్యకలాపాలు పర్యవేక్షిస్తుందని ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో భారత సీనియర్ జట్టులో ఆంధ్రనుంచి ఆటగాళ్లు ఎంపికవుతారని గంగరాజు విశ్వాసం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు