పది నాటికి ఆన్‌లైన్‌లో ఓటర్ల జాబితా

27 Jun, 2013 05:02 IST|Sakshi

కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఓటర్ల జాబితాను వచ్చే నెల పదో తేదీకి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని రాష్ట్ర అదనపు చీఫ్ ఎలక్ట్రోల్ అధికారి వి.వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. జిల్లాలో 2014 సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియలో భాంగా ఇంటింటికీ వెళ్లి పేర్లు సేకరించి ఓటర్ల జాబితాలో చేర్పించాలని సూచించారు. బుధవారం పాత జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓటర్ల నమోదు కార్యక్రమంపై ఆర్డీఓలు, తహశీల్దార్లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్పులు, చేర్పులు, సవరణలు, చనిపోయిన , వలస వెళ్లిన వారి పేర్లను క్షుణ్ణంగా పరిశీలించి జాబితాను సరి చేయాలన్నారు.
 
 శతశాతం ఓటర్ల నమోదు జరగాలని, జాబితాలో నకిలీ ఓటర్లు లేకుండా లేకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా యువత ఓటరుగా నమోదు అయ్యేలా చూడాలని, ఇందులో భాగంగా కళాశాలలు, యూనివర్సిటీలకు వెళ్లాలన్నారు. ఈ విషయంలో ఆర్డీవోలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఏజేసీ రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల 29న ఓటర్ల నమోదు కార్యక్రమంపై స్టేజ్-1 అధికారులతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీనాటి జిల్లాలో ఓటర్ల నమోదు కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషాఖాసీం, ఐటీడీఏ పీఓ సునీల్‌రాజ్‌కుమార్, జెడ్పీ సీఈఓ కైలాస్‌గిరీశ్వరరావు, ఆర్‌డీఓలు జి.గణేష్, వి.విశ్వేశ్వరరావు, బలివాడ దయానిధి  పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు