కరోనా సంక్షోభం తర్వాత తొలి క్రికెట్‌ లీగ్‌

14 May, 2020 15:24 IST|Sakshi
వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు(ఫైల్‌ఫొటో)

కరీబియన్‌ దీవుల్లో క్రికెట్‌ కళ

6 జట్లు.. 30 మ్యాచ్‌లు

ఆంటిగ్వా: ఒకవైపు కరోనా సంక్షోభం కొనసాగుతుండగానే వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు ఒక లీగ్‌ను నిర్వహించడానికి సిద్ధమైంది.  విన్సీ ప్రీమియర్‌ లీగ్‌(వీపీఎల్‌)లో భాగంగా టీ10 క్రికెట్‌ను నిర్వహించడానికి షెడ్యూల్‌ ఖరారు చేసింది.  తూర్పు కరీబియన్‌ దీవుల్లో నిర్వహించ తలపెట్టిన ఈ టోర్నీతో విండీస్‌లో మళ్లీ క్రికెట్‌ కళను తీసుకురావాలని యోచిస్తోంది. మే 22వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకూ ఈ లీగ్‌ జరుగనుంది. మొత్తం ఆరు జట్లు పాల్గొనే ఈ లీగ్‌లో 30 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇందులో 72 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారని విండీస్‌ క్రికెట్‌ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో అంతర్జాతీయ క్రికెటర్లు కూడా పాల్గొనున్నారు. (ప్రేక్షకులు వద్దు.. మనమే ‘కేక’ పెట్టిద్దాం)

కాగా, కరోనా సంక్షోభం తర్వాత ఐసీసీలో సభ్యత్వం కల్గిన ఒక దేశం నిర్వహిస్తున్న తొలి క్రికెట్‌ టోర్నీ ఇదే కావడం విశేషం. అదే సమయంలో బంతిపై లాలాజలాన్ని రుద్దకుండా ఐసీసీ ప్రతిపాదించిన నిబంధనలు అమలు చేయబోతున్న మొదటి లీగ్‌ కూడా ఇదే. ‘ మేము టీ10 క్రికెట్‌ ఫార్మాట్‌తో తొలి అడుగు వేశాం. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ ఈవెంట్లు నిలిచిపోయిన తరుణంలో మరింత పొట్టి ఫార్మాట్‌ను నిర్వహించాలనుకున్నాం. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌ను కచ్చితంగా అలరిస్తుంది. ఈ లీగ్‌ సమయం 10 రోజులే కావడంతో మంచి మజా వస్తుంది. వీటిని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాం’ అని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కిషోర్‌ షాలో తెలిపారు. బంతిపై సలైవాను రుద్దడాన్ని నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఆటగాళ్లు బౌతిక దూరం పాటిస్తూనే బరిలోకి దిగుతారన్నారు. గ్యాలరీల్లో ప్రేక్షకులు ఎవరూ ఉండరు కాబట్టి ఆటగాళ్లు భౌతిక దూరం పాటించడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు.(‘నన్ను ఎందుకు తీశావని ధోనిని అడగలేదు’)

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దాదాపు ప్రపంచమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. తద్వారా క్రీడా ఈవెంట్లు కూడా వాయిదా పడ్డాయి. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ అయిన ఈ సీజన్‌ ఐపీఎల్‌ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా,  జరుగుందో.. లేదో అనేది ఇప్పటికీ డైలమాలోనే ఉంది. అదే సమయంలో అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్‌ జరగాల్సి ఉంది. ఇది జరుగుతుందా.. లేదా అనే దానిపై క్లారిటీ రాలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మెగాటోర్నీని నిర్వహించడం కష్టసాధ్యంగానే చెప్పవచ్చు. దీనిపై ఐసీసీతో పాటు క్రికెట్‌ ఆస్ట్రేలియాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. దానిలో భాగంగానే ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి అనుమతులు తప్పనిసరి. ఇక ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు ఈ టోర్నీలో పాల్గొనబోయే ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు