నగరంలో వీవీఎస్‌ మరో అకాడమీ

3 Mar, 2017 10:35 IST|Sakshi
నగరంలో వీవీఎస్‌ మరో అకాడమీ

డీపీఎస్‌ నాచారంలో ఏర్పాటు  
అత్యుత్తమ శిక్షణ అందిస్తామన్న లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో అత్యుత్తమ క్రికెట్‌ శిక్షణ అందించే క్రమంలో భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ మరో అడుగు ముందుకు వేశారు. రెండేళ్ల క్రితం తొలి వీవీఎస్‌ అకాడమీని ఏర్పాటు చేసిన లక్ష్మణ్‌ ఇప్పుడు తన రెండో అకాడమీని కూడా ప్రారంభించనున్నారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఈ అకాడమీ ఏర్పాటవుతోంది. లక్ష్మణ్‌ తొలి అకాడమీ శ్రీనిధి ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో పని చేస్తోంది. కొత్త అకాడమీకి సంబంధించిన విశేషాలను లక్ష్మణ్‌ గురువారం మీడియాకు వెల్లడించారు. ‘హైదరాబాద్‌లో ఉత్తమ క్రికెట్‌ శిక్షణ ఎక్కువ మం దికి అందుబాటులోకి రావాలనేది నా కోరిక. అందు కోసం 4–5 అకాడమీలు ఏర్పా టు చేయాలని సంకల్పించాను. ఇందులో భా గంగా రెండోది డీపీఎస్‌ నాచారంలో ప్రారంభం కానుంది. అత్యుత్తమ మౌలిక సౌకర్యాలు, మంచి కోచ్‌లతో ఇక్కడ శిక్షణనిస్తాం. రెగ్యులర్‌ కోచింగ్‌ తర్వాత వీడియో విశ్లేషణలు కూడా ఈ అకాడమీలో అందుబాటులో ఉంచాం. శిక్షణార్ధులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశకు లోను కాకూడదన్నదే మా ఉద్దేశం’ అని వీవీఎస్‌ వెల్లడించారు. డీపీఎస్‌లో మొత్తం 10 పిచ్‌లు ఉన్నాయి.

ఇందులో 5 టర్ఫ్‌ వికెట్‌లు కాగా, మిగతావి ఆస్ట్రోటర్ఫ్, మ్యాటింగ్, సిమెంట్‌ వికెట్‌లు ఉన్నాయి. ఇక్కడ ముందుగా వేసవి శిక్షణా శిబిరం ఏప్రిల్‌ 3నుంచి ప్రారంభం కానుంది. జూన్‌ మొదటి వారం వరకు ఇది కొనసాగుతుంది. రెగ్యులర్‌గా కోచింగ్‌ తీసుకునే ఆటగాళ్ల కోసం మూడు వయో విభాగాల్లో వేర్వేరుగా శిక్షణ ఇస్తారు. 5–10 ఏళ్ల వయసు, 10–15 ఏళ్లు, 15 ఏళ్ల పైబడినవారిగా వీటిని విభజించారు. ‘మిగతా అకాడమీల ఏర్పాటు గురించి కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే మున్ముందు దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో కూడా వీవీఎస్‌ అకాడమీలను విస్తరిస్తాను’ అని లక్ష్మణ్‌ చెప్పారు.

 

మరో వైపు వీవీఎస్‌లాంటి దిగ్గజ క్రికెటర్‌తో జత కట్టడం పట్ల డీపీఎస్‌ చైర్మన్‌ ఎం. కొమరయ్య సంతోషం వ్యక్తం చేశారు. ‘మా పాఠశాలలో 700కు పైగా విద్యార్థులు ఉన్నారు. అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. పెద్ద మైదానం సహా అత్యుత్తమ క్రీడా సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీవీఎస్‌ రాకతో క్రికెట్‌ కూడా ఊపందుకుంటుందని మా నమ్మకం. డీపీఎస్‌ విద్యార్థులే కాకుండా ఆసక్తి గలవారు ఎవరైనా ఈ అకాడమీలో శిక్షణ తీసుకునేందుకు అవకాశం ఉంది’ అని కొమరయ్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీపీఎస్‌ అకడమిక్‌ డైరెక్టర్‌ టి.సుధ తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు