ధావన్‌పైనే వేటు ఎందుకు?: లక్ష్మణ్‌

11 Aug, 2018 16:42 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌తో లార్డ్స్‌ వేదికగా ఆరంభమైన రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌పై వేటు వేయడాన్ని మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశ‍్నించాడు. తొలి టెస్టులో కోహ్లి మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ అందరూ విఫలమైనా.. రెండో టెస్టుకి ధావన్‌‌ని మాత్రమే తుది జట్టు నుంచి తప్పించడం భావ్యం కాదని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.

‘బర్మింగ్‌హామ్ టెస్టులో కోహ్లి మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ అందరూ విఫలమయ్యారు. ఆ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, మురళీ విజయ్‌తో పోలిస్తే శిఖర్ ధావన్‌ కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. అతని ఫుట్‌వర్క్‌ని గమనిస్తే ఆ విషయం తెలుస్తుంది. కానీ.. లార్డ్స్‌ టెస్టులో అతనిపై వేటు వేశారు. దానికి కారణంగా.. అతను ఔటైన తీరుని చూపిస్తున్నారు. ఒక స్ట్రోక్‌ ప్లేయర్‌ స్లిప్‌లో బంతిని తరలించే ప్రయత్నంలో కొన్ని సార్లు వికెట్‌ను చేజార్చుకోవచ్చు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా ఇలానే ఆడేవాడు. కానీ.. వారికి ఆ షాట్లే బలం. విదేశీ గడ్డపై ధావన్‌తో పాటు టాప్ ఆర్డర్‌లోని కొంత మంది బ్యాట్స్‌మెన్‌లు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా 2015 నుంచి టాప్‌-4లో ఉన్న ఆటగాళ్లు విదేశాల్లో తడబడటం చూస్తునే ఉన్నాం. ఇక్కడ పుజారా కూడా విఫలమైన వారిలో ఒకడు. కానీ.. ఎందుకో ప్రతిసారీ ధావన్‌పైనే వేటు పడుతోంది’ అని వీవీఎస్ లక్ష్మణ్ పెదవి విరిచాడు.

మరిన్ని వార్తలు