టీ షాపు యజమానిపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసలు

7 Nov, 2019 12:26 IST|Sakshi

‘మహ్మద్‌ మెహబూబ్‌ మాలిక్‌... కాన్పూర్‌కు చెందిన ఛాయ్‌వాలా. ఓ చిన్న షాపు కలిగిన అతడు 40 మంది పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. తన ఆదాయంలో 80 శాతం మేర వారి విద్య కోసమే ఖర్చు చేస్తున్నాడు. ఇదే నిజంగా ఎంతో స్పూర్తిదాయకం కదా’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఉత్తరప్రదేశ్‌కు చెందిన టీ షాపు యజమానిపై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు లక్ష్మణ్‌ చేసిన ట్వీట్‌ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో అతడికి సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇతను ఛాయ్‌వాలా కాదు.. బడా దిల్‌వాలా’ అంటూ అతడిని అభినందిస్తున్నారు. ఇక లక్ష్మణ్‌ ట్వీట్‌కు స్పందించి టీ వాలా మహ్మద్‌... హృదయపూర్వక ధన్యవాదాలు సార్‌ అంటూ బదులిచ్చాడు.

కాగా కాన్పూర్‌కు చెందిన మహ్మద్‌ మెహబూబ్‌ మాలిక్‌కు సామాజిక సేవ చేయడంలో ముందుంటాడు. టీ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్న అతడు దాదాపు 40 మంది చిన్నారులను చదివిస్తున్నాడు. మా తుజే సలాం పేరిట ఫౌండేషన్‌ నెలకొల్పి అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు. అంతేకాదు ఎన్నికల సమయంలోనూ మరక మంచిదే అంటూ ఓటు విలువను తెలియజేస్తూ ఓటర్లను చైతన్యవంతం చేయడం వంటి పలు కార్యక్రమాలు చేపట్టాడు. 

మరిన్ని వార్తలు