వార్నర్‌కు సరితూగలేరెవ్వరూ...

21 Mar, 2019 10:04 IST|Sakshi

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మెంటార్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ వ్యాఖ్య  

సాక్షి, హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్, ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌పై జట్టు మెంటార్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆటగాడిగానే కాకుండా అతని సారథ్య నైపుణ్యాల ముందు వేరే వారెవరూ సాటిరాలేరని కితాబిచ్చాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం తర్వాత ఏడాది పాటు నిషేధాన్ని ఎదుర్కొన్న వార్నర్‌... ఐపీఎల్‌ ఆడేందుకు భారత్‌ వచ్చాడు. మరోవైపు జట్టులో కొత్తగా చేరిన సభ్యుల పరిచయ కార్యక్రమాన్ని బుధవారం సన్‌రైజర్స్‌ యాజమాన్యం నిర్వహించింది. మార్టిన్‌ గప్టిల్‌ (న్యూజిలాండ్‌), జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్‌), విజయ్‌ శంకర్, అభిషేక్‌ శర్మ, షాబాజ్‌ నదీమ్‌ (భారత్‌)లు ఈ సీజన్‌ నుంచి సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో జట్టు ఆటగాళ్లతో పాటు కోచ్‌ టామ్‌ మూడీ, మెంటార్‌ లక్ష్మణ్, బౌలింగ్‌ కోచ్‌ ముత్తయ్య మురళీధరన్‌ పాల్గొన్నారు.

వార్నర్‌ రాకతో జట్టు పటిష్టమైందని, అతనో ప్రపంచ స్థాయి క్రీడాకారుడని లక్ష్మణ్‌ అన్నాడు. ‘ప్రస్తుత సారథి కేన్‌ విలియమ్సన్‌కు వార్నర్‌ తోడవ్వడంతో సన్‌రైజర్స్‌ ఇంకా పటిష్టంగా మారింది. గతంలో సారథిగా వార్నర్‌ జట్టును నడిపించిన తీరుపట్ల ఫ్రాంచైజీ గర్విస్తోంది. మ్యాచ్‌ విన్నర్‌గానే కాకుండా కెప్టెన్‌గా అతని ప్రతిభకు సాటి లేదు. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా వార్నర్‌ యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తాడు’ అని లక్ష్మణ్‌ వివరించాడు. ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ... దాని ప్రభావం వార్నర్‌పై ఉండబోదని కోచ్‌ టామ్‌ మూడీ అభిప్రాయ పడ్డాడు.

‘వార్నర్‌ సానుకూలంగా ఆలోచించే వ్యక్తి. అతనో దిగ్గజ ఆటగాడు. ఎప్పుడూ ఏదో సాధించాలనే జిజ్ఞాసతో ఉంటాడు. కొంతకాలం అతని నుంచి క్రికెట్‌ను దూరం చేసినంత మాత్రాన... అతని దృక్పథంలో ఎలాంటి మార్పు ఉండదు’ అని మూడీ విశ్లేషించాడు. కేన్‌ విలియమ్సన్‌ ప్రపంచమంతా గౌరవించదగిన అత్యుత్తమ ఆటగాడు, గొప్ప లీడర్‌ అని మూడీ పేర్కొన్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ కోచ్‌ ముత్తయ్య మురళీధరన్‌ మాట్లాడుతూ అండర్‌–19 ప్లేయర్‌ అభిషేక్‌ శర్మ, ఇండియా ‘ఎ’ లెఫ్టార్మ్‌ స్పిన్పర్‌ షాబాజ్‌ నదీమ్‌ చేరికతో సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ దళం పటిష్టమైందని అన్నాడు. గతేడాదితో పోలిస్తే ఈసారి స్పిన్నర్లు, పేసర్లతో జట్టు సమతూకంగా ఉందని తెలిపాడు.

మరిన్ని వార్తలు