కోచ్‌గా కుంబ్లేనే కొనసాగించాలనుకున్నాం..

22 Dec, 2018 00:49 IST|Sakshi

కానీ అతనే వద్దనుకున్నాడు ∙వీవీఎస్‌ లక్ష్మణ్‌ వ్యాఖ్య 

సాక్షి, విశాఖపట్నం: టీమిండియా కోచ్‌గా అనిల్‌ కుంబ్లేనే కొనసాగించాలని తమ క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) భావించిందని... అయితే కుంబ్లే మాత్రం వైదొలగేందుకే నిర్ణయం తీసుకున్నాడని సీఏసీ సభ్యుడైన వీవీఎస్‌ లక్ష్మణ్‌ వెల్లడించాడు. అతనితో పాటు మిగతా సభ్యులు సచిన్, సౌరవ్‌ గంగూలీ 2016లో కోచ్‌గా కుంబ్లేను ఎంపిక చేశారు. అయితే గతేడాది కెప్టెన్‌ కోహ్లితో తలెత్తిన విభేదాల కారణంగా కోచ్‌ పదవి నుంచి కుంబ్లే తప్పుకున్నాడు. చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత కోచ్‌గా కొనసాగేందుకు సుముఖత చూపలేదు. వెస్టిండీస్‌ పర్యటన దాకా అతని పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేశాడు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన లక్ష్మణ్‌ ఈ ఉదంతం  తమ కమిటీకి చేదు గుళికను మిగిల్చిందని అభిప్రాయపడ్డాడు. ‘కోహ్లి హద్దు దాటాడని నేను భావించడం లేదు. అయితే మా కమిటీ మాత్రం కుంబ్లేను కొనసాగించాలనుకుంది. కానీ తను మాత్రం వైదొలగడమే సరైన నిర్ణయమని చెప్పేశాడు. ఏదేమైనా సీఏసీకిది చేదు అనుభవం. మా కమిటీ ఓ మ్యారేజ్‌ కౌన్సెలింగ్‌ సంస్థ కాదని చాలా మందికి చెప్పాను. మా పని కోచ్‌ పదవికి అర్హతలున్న వారిలో మెరుగైన వ్యక్తిని ఎంపిక చేయడమే. దురదృష్టం కొద్దీ కోహ్లి–కుంబ్లేల జోడీ కుదరలేదు’ అని బ్యాటింగ్‌ దిగ్గజం అన్నాడు.  

‘281’ భారత క్రికెటర్‌ అద్భుత ఇన్నింగ్స్‌
బెంగళూరు: ఈడెన్‌ గార్డెన్స్‌లో 2001లో ఆస్ట్రేలియాపై ‘వెరీ వెరీ స్పెషల్‌’ బ్యాట్స్‌మన్‌ లక్ష్మణ్‌ చేసిన 281 పరుగుల వీరోచిత పోరాటం ఓ భారతీయుడి అద్భుత ఇన్నింగ్స్‌ అని మాజీ కెప్టెన్‌ ద్రవిడ్‌ కితాబిచ్చాడు. లక్ష్మణ్‌ ఆత్మకథ ‘281 అండ్‌ బియాండ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ద్రవిడ్‌ మాట్లాడుతూ ‘ఇందులో సందేహమే లేదు. అప్పటి పరిస్థితులు, మేటి జట్టుతో పోటీ దృష్ట్యా లక్ష్మణ్‌ చేసిన 281 స్కోరు ఓ భారత క్రికెటర్‌ ఆడిన అద్భుత, అసాధారణ ఇన్నింగ్స్‌. ఆ సందర్భంలో అతనితో పాటు క్రీజులో ఉన్న నాకు ఘనచరిత్రలో భాగమయ్యే అదృష్టం దక్కింది. ఇప్పటికీ ఆ ఇన్నింగ్స్‌ నా మదిలో మెదులుతుంది. అతని పోరాటం గుర్తుకొస్తుంది. గింగిరాలు తిరిగే కంగారూ స్పిన్‌ లెజెండ్‌ షేన్‌ వార్న్‌ బంతుల్ని ఆడిన నేర్పు... క్రీజులో ఎంతసేపున్నా అలసిపోని ఓర్పు చాలా గ్రేట్‌! మెక్‌గ్రాత్, గిలేస్పి సీమ్‌ బౌలింగ్‌లో అతని డ్రైవ్‌లు అద్భుతం. ఇదంతా అతి సమీపం నుంచి చూసిన అదృష్టం నాది’ అని చెప్పుకొచ్చాడు. అదేపనిగా ఇంట్లో కూర్చొని టీవీలో క్రికెట్‌ చూడటం తనకు ఇష్టం వుండదని, కానీ లక్ష్మణ్‌ ఇన్నింగ్స్‌ వస్తే మాత్రం చూడకుండా వుండలేనని ద్రవిడ్‌ తెలిపాడు. ఈ కార్యక్రమంలో భారత క్రికెట్‌ దిగ్గజాలు గుండప్ప విశ్వనాథ్, కుంబ్లే, ప్రసన్నలతో పాటు రోజర్‌ బిన్నీ, కిర్మాణి, జవగళ్‌ శ్రీనాథ్, దొడ్డ గణేష్, రాబిన్‌ ఉతప్ప పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు