ఆసీస్‌తో టెస్టు: రెండో బౌలర్‌గా రికార్డు..

28 Dec, 2019 16:10 IST|Sakshi

మెల్‌బోర్న్‌: న్యూజిలాండ్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ నీల్‌ వాగ్నర్‌ అరుదైన ఘనతను సాధించాడు. న్యూజిలాండ్‌ తరఫున వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో  జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు సాధించిన వాగ్నర్‌.. రెండో ఇన్నింగ్స్‌ మూడో రోజు ఆటలో రెండు వికెట్లు తీశాడు. ఫలితంగా 200వ టెస్టు వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. దాంతో న్యూజిలాండ్‌ దిగ్గజ పేసర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ తర్వాత వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. రిచర్డ్‌ హ్యాడ్లీ తన 44వ టెస్టులో 200 వికెట్ల మార్కును చేరగా, వాగ్నర్‌ 46వ టెస్టులో ఆ ఫీట్‌ను అందుకున్నాడు.  కివీస్‌ తరఫున వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన జాబితాలో హ్యాడ్లీ, వాగ్నర్‌ తర్వాత స్థానాల్లో ట్రెంట్‌ బౌల్ట్‌(52 మ్యాచ్‌లు), టిమ్‌ సౌతీ(56 మ్యాచ్‌లు), క్రిస్‌ కెయిన్స్‌(58 మ్యాచ్‌లు)లు ఉన్నారు.

జడేజా తర్వాతే వాగ్నర్‌..
ఇక వేగవంతంగా రెండొందల టెస్టు వికెట్లు సాధించిన లెఫ్టార్మ్‌ బౌలర్ల జాబితాలో కూడా వాగ్నర్‌ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ జాబితాలో భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజా తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత వాగ్నర్‌ నిలిచాడు. జడేజా తన 44వ టెస్టులో రెండొందల టెస్టు వికెట్లు సాధించిన ఎడమచేతి బౌలర్‌. ప్రస్తుతం ఆసీస్‌ జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వాగ్నర్‌ ఇప్పటివరకూ 13 వికెట్లతో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా ఉన్నాడు. ఇక ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో వాగ్నర్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రెండో టెస్టులో ఆసీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. దాంతో ఆసీస్‌కు 456 పరుగుల ఆధిక్యం సాధించింది. కివీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 148 పరుగులకు ఆలౌట్‌ కాగా, ఆసీస్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 467 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు