పదేళ్ల తర్వాత... 

27 Mar, 2018 01:02 IST|Sakshi

సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించిన న్యూజిలాండ్‌

డే–నైట్‌ టెస్టులో ఇన్నింగ్స్‌ 49 పరుగులతో గెలుపు

ఆక్లాండ్‌: న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌లు మొదలై 88 సంవత్సరాలైంది. ఈ కాలంలో ఈ రెండు జట్లు 102 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. అయితే ఎట్టకేలకు ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌ విజయాల సంఖ్య రెండంకెలకు చేరుకుంది. మూడేళ్ల క్రితం లీడ్స్‌లో చివరిసారి ఇంగ్లండ్‌తో తలపడి గెలుపొందిన న్యూజిలాండ్‌... తాజాగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి డే–నైట్‌ టెస్టులోనూ నెగ్గి ఇంగ్లండ్‌పై 10వ విజయం నమోదు చేసింది. ఆట చివరిరోజు సోమవారం ఓవర్‌నైట్‌ స్కోరు 132/3తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ 320 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 49 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. సొంతగడ్డపై పదేళ్ల తర్వాత ఇంగ్లండ్‌పై నెగ్గిన న్యూజిలాండ్‌... 1984 తర్వాత ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్‌ తేడాతో నెగ్గడం గమనార్హం. కివీస్‌ బౌలర్లలో ‘మ్యాన్‌ ఆఫ్‌ద మ్యాచ్‌’ బౌల్ట్‌ (3/67), వాగ్నర్‌ (3/77), టాడ్‌ ఆస్టల్‌ (3/39) మూడేసి వికెట్లు తీశారు.

ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్‌ 1–0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు ఈనెల 30 నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుంది.  
ఓటమి నుంచి గట్టెక్కాలంటే చివరి రోజు మొత్తం బ్యాటింగ్‌ చేయాల్సిన పరిస్థితిలో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి ఆడారు. అయితే తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ మూడు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. ఈ దశలో బెన్‌ స్టోక్స్‌ (188 బంతుల్లో 66; 6 ఫోర్లు), క్రిస్‌ వోక్స్‌ (118 బంతుల్లో 52; 8 ఫోర్లు) పట్టుదలతో ఆడారు. ఏడో వికెట్‌కు 83 పరుగులు జోడించి న్యూజిలాండ్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. అయితే రెండో సెషన్‌ చివరి క్షణాల్లో స్టోక్స్‌ను ఔట్‌ చేయడం... చివరి సెషన్‌లో మిగిలిన మూడు వికెట్లు తీయడంతో న్యూజిలాండ్‌ విజయం ఖాయమైంది.   

మరిన్ని వార్తలు