వహాబ్‌ రియాజ్‌ గుడ్‌ బై?

2 Aug, 2019 18:27 IST|Sakshi

కరాచీ: కొన్నిరోజుల క్రితం పాకిస్తాన్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది.  ఇక తాను టెస్టు క్రికెట్‌ ఆడనంటూ ఉన్నపళంగా ప్రకటన చేయడం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)లో అలజడి రేపింది. దీనిపై ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తుపోశారు కూడా. 27 ఏళ్ల వయసులోనే టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకుని పాక్‌ క్రికెట్‌కు ద్రోహం చేశావంటూ షోయబ్‌ అక్తర్‌ ఘాటుగా విమర్శించాడు. అదే సమయంలో ఆమిర్‌ తర్వాత రియాజ్‌ టెస్టులకు గుడ్‌ బై చెప్పబోతున్నాడా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేశాడు అక్తర్‌.

ఇప్పుడు అదే నిజమైనట్లు కనబడుతోంది. తాజాగా 34 ఏళ్ల వహాబ్‌ రియాబ్‌ టెస్టులకు వీడ్కోలు చెప్పాడట. ఇప్పటికే ఈ విషయాన్ని పాక్‌ క్రికెట్‌ బోర్డుకు తెలియజేశాడని, ఇక కేవలం సాధారణ ప్రకటన మాత్రమే చేయాల్సి ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ 27 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రియాజ్‌ 83 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు 5/63గా ఉంది. చివరిసారి 2018 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌ ఆడాడు రియాజ్‌.

మరిన్ని వార్తలు