మార్పులు అనివార్యం!

23 Dec, 2016 23:44 IST|Sakshi
మార్పులు అనివార్యం!

సుప్రీం తుది తీర్పు కోసం వేచి చూస్తున్నాం
ప్రపంచ క్రికెట్‌ అభివృద్ధిలో బీసీసీఐది ప్రధాన పాత్ర
 ఐసీసీ టెస్టు జట్టులో కోహ్లిని ఎలా విస్మరిస్తారు?
బోర్డు అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌


న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులు ఆటగాళ్లకు ఏమాత్రం మంచిది కాదని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. వచ్చే నెల 2 లేదా 3 తర్వాత బోర్డులో చాలా మార్పులు జరగవచ్చని ఆయన సూత్రపాయంగా వెల్లడించారు. లోధా ప్యానెల్‌ సూచించిన ప్రతిపాదనల అమలు విషయంలో సుప్రీం కోర్టు జనవరి మొదటి వారంలో తుది తీర్పునివ్వనుంది. కోర్టు తీర్పు ఇచ్చే వరకు వేచి చూడాల్సిందేనని, ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు. ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌ (పీడబ్ల్యూఎల్‌) ప్రమోషనల్‌ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియాతో పలు అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...

ప్రస్తుతం భారత క్రికెట్‌లో నెలకొన్న పరిస్థితి ఆటకే కాకుండా ఆటగాళ్లకు కూడా ఏమంత మంచిది కాదని మాకు తెలుసు. మేం ఇప్పుడు సమస్యల్లో ఉన్నాం. జనవరి 3 వరకు వేచి చూడాల్సిందే. ఆ తర్వాత చాలా మార్పులు ఉండే అవకాశం ఉంది. ఒక్కోసారి ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వాటిని దీటుగా ఎదుర్కోవాల్సిందే. అయితే అన్నింటికీ సానుకూల పరిష్కారం లభిస్తుందనుకుంటున్నాను.

   ప్రభుత్వం నుంచి నయా పైసా కూడా స్వీకరించకుండా బీసీసీఐ సొంతంగా సౌకర్యాలను సమకూర్చుకుంది. అయినా కొంత మంది మాజీ ఆటగాళ్లు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మా దగ్గర భారీగా నిధులున్నా కూడా వాటిని ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇందుకు కోర్టు అనుమతి కావాలి.

బోర్డు సభ్యులకు గరిష్ట వయస్సు, ఒక రాష్ట్రం ఒక ఓటు, పదవులను అధిష్టించేందుకు కూలింగ్‌ పీరియడ్‌ వంటి లోధా ప్యానెల్‌ ప్రతిపాదనలను అమలు చేయడం అంత సులువుకాదు.

భారత టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఈ ఏడాది ఐసీసీ తమ ఉత్తమ టెస్టు జట్టులో చోటివ్వాల్సింది. ప్రస్తుతం అతడి ఫామ్‌ను లెక్కలోకి తీసుకుంటే కచ్చితంగా అతను ఆ జట్టులో ఉండాలి. భారత జట్టు టెస్టుల్లో నంబర్‌వన్‌గా ఉన్నప్పుడు ఆ కెప్టెన్‌ను ఎందుకు ఎంపికచేయరు? ఐసీసీ ఓసారి ఈ విషయంలో దృష్టి సారిం చాలి. అయితే అశ్విన్‌ ప్రతిభను గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది

ఐసీసీ వర్కింగ్‌ గ్రూపులో బీసీసీఐని చేర్చకపోవడాన్ని తప్పుబడుతున్నాను. ఆ సమావేశంలో నేనూ పాల్గొన్నాను. బీసీసీఐ ఉంటేనే విశ్వవ్యాప్తంగా క్రికెట్‌ను పటిష్ట పరిచే అవకాశముంటుందని ఆ సమావేశంలో ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఒకవేళ ఎవరైనా బీసీసీఐ లేకున్నా తాము ముందుకెళతామని భావిస్తే... ప్రపంచ క్రికెట్‌కు భారత్‌ అవసరమన్న సంగతి గుర్తుంచుకోవాలి.  
 

మరిన్ని వార్తలు