కోహ్లితో పోల్చకండి: హైదర్‌ అలీ

23 Mar, 2020 19:00 IST|Sakshi

న్యూఢిల్లీ: తనను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పోల్చవద్దని పాకిస్తాన్‌ యువ బ్యాట్స్‌మన్‌ హైదర్‌ అలీ కోరాడు. అభిమానులు తనను పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌ పేరుతో పిలవాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. అండర్‌-19 జట్టు ఓపెనర్‌ అయిన హైదర్‌ అలీ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) తాజా సీజన్‌లో రాణించడంతో అతడిపై మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రాజా ప్రశంసలు కురిపించాడు. హైదర్‌ అలీలో కోహ్లి, బాబర్‌ అజామ్‌ల తరహా టాలెంట్‌ ఉందని.. ఏదొక రోజు అతడు ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌గా ఎదుగుతాడని పొగిడాడు. (కోహ్లిని తలపించే మొనగాడు వచ్చాడు..!)

ఈ నేపథ్యంలో హైదర్‌ అలీ స్పందిస్తూ... ‘తన రోల్‌ మోడల్స్‌లా అవ్వాలని ఏ బ్యాట్స్‌మన్‌ అనుకోడు. కానీ తనకు తానుగా మెరుగవుతూ వారిలా షాట్స్‌ ఆడేందుకు ప్రయత్నించాలి. నాను నేనుగా మెరుగవ్వాలని అనుకుంటున్నాను. కోహ్లి పేరుతో కాకుండా బాబర్‌ అజామ్‌ పేరుతో నన్ను పిలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాబర్‌ మంచి షాట్లు ఆడతాడు. విరాట్‌ కోహ్లిలా ఉండాలని అనుకోవడం లేదు. కానీ ప్రాక్టీస్‌ చేసి అతడిలా షాట్లు కొట్టేందుకు మాత్రం ప్రయత్నిస్తాను. నేను హైదర్‌ అలీని. నేను నాలాగే ఉండేందుకు ఇష్టపడతాను. ఫస్ట్‌ క్లాస్‌ టోర్నమెంట్‌ సందర్భంగా ఒకసారి బాబర్‌ అజామ్‌ను కలిశాను. బ్యాటింగ్‌ గురించి కొన్ని మెళకువలు నాకు చెప్పాడు. లాహోర్‌లోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో అతడి నుంచి చాలా నేర్చుకున్నా. పీఎస్‌ఎల్‌లోనూ నన్ను అతడు ఎక్కువగా ప్రోత్సహించాడు. పరుగులు సాధించడంపైనే దృష్టి పెట్టు. మిగతా విషయాలు దేవుడికి వదిలేయాలని బాబర్‌ సూచించాడు’ అని వెల్లడించాడు. (దొంగ నిల్వలు పెట్టుకోవద్దు: అక్తర్‌)

మరిన్ని వార్తలు