వచ్చేసారి స్వర్ణం సాధిస్తా!

30 Aug, 2017 08:17 IST|Sakshi
వచ్చేసారి స్వర్ణం సాధిస్తా!

ప్రపంచ చాంపియన్‌ అవుతాననే నమ్మకముంది
బ్యాడ్మింటన్‌కు ఆదరణ బాగా పెరిగింది
మీడియాతో పీవీ సింధు


సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో పరాజయం పాలైనా... తర్వాతి ప్రయత్నంలో తాను స్వర్ణం సాధిస్తానని భారత స్టార్‌ క్రీడాకారిణి పూసర్ల వెంకట (పీవీ) సింధు విశ్వాసం వ్యక్తం చేసింది. గ్లాస్గోలో ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో సింధు రజతం సాధించిన సంగతి తెలిసిందే. గతంలో కాంస్యానికే పరిమితమైన తాను ముందుగా అనుకున్నట్లుగా మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వడం సంతృప్తి కలిగించిందని ఆమె చెప్పింది. స్కాట్లాండ్‌ నుంచి మంగళవారం నగరానికి తిరిగి వచ్చిన అనంతరం సింధు మీడియాతో మాట్లాడింది. విశేషాలు ఆమె మాటల్లోనే...

 రజత పతకం సాధించడంపై...
రియో ఒలింపిక్స్‌ తర్వాత ఏడాది వ్యవధిలోనే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించడం చాలా సంతోషంగా ఉంది. టోర్నీకి వెళ్లే ముందు నాపై నేను పెట్టుకున్న నమ్మకం నిజమైంది. ఫైనల్‌ మ్యాచ్‌ నా కెరీర్‌లోనే అత్యుత్తమమైంది. ఓవరాల్‌గా నా కెరీర్‌ చాలా అద్భుతంగా సాగుతోంది. వచ్చేసారి బంగారు పతకం సాధించగలనని గట్టిగా చెప్పగలను. టోర్నీలో నా సహజ శైలిలోనే ఆడే ప్రయత్నం చేశాను తప్ప చైనా ప్రత్యర్థులతో పోల్చుకుంటూ వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. అయితే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ కోసం సన్నద్ధమయ్యేందుకు మాకు తగిన సమయం లభించింది. దాదాపు రెండు నెలల పాటు తీవ్రంగా సాధన చేశాం. అదే ఇప్పుడు ఫలితాన్ని చూపించింది.  

ఫైనల్‌ మ్యాచ్‌పై...
చివరి గేమ్‌లో 20–20తో ఉన్నప్పటికీ మ్యాచ్‌ కోల్పోవడం మాత్రం నన్ను చాలా కాలం వెంటాడవచ్చు. ఇది మాత్రం చాలా నిరాశ కలిగించింది. అయితే ఇద్దరం హోరాహోరీగా తలపడ్డాం. శారీరకంగా, మానసికంగా అలసిపోయాం. అయితే శక్తిని దాచుకొని చివర్లో చెలరేగిపోదామనే పరిస్థితి అక్కడ లేదు. అది ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కాబట్టి ఎవరూ వెనక్కి తగ్గలేదు. చివరకు అది నా రోజు కాకుండా పోయింది. ఇంత గొప్ప మ్యాచ్‌లో భాగమైనందుకు గర్వంగా ఉంది. స్టేడియంలో పెద్ద సంఖ్యలో భారత అభిమానులు మమ్మల్ని ప్రోత్సహించడం మరచిపోలేను.  

సుదీర్ఘ ర్యాలీలపై...
73 షాట్‌ల ర్యాలీ నా జీవితంలో ఎప్పుడూ ఆడలేదు. ఇటీవల బ్యాడ్మింటన్‌లో ర్యాలీల ప్రాధాన్యత పెరిగింది. సుదీర్ఘ ర్యాలీలు తరచుగా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. వాటి ద్వారా  పాయింట్లు సాధించేందుకు ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఆ రకంగా చూస్తే మేం ఆడిన మ్యాచ్‌ ఈ ఆటలో ఫిట్‌నెస్‌ ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేసింది. ఎవరూ సునాయాసంగా పాయింట్లు ఇవ్వడం లేదు. దాని కోసం ప్రతి ఆటగాడు అదనంగా శ్రమించాల్సి వస్తోంది.  

ఆటకు లభిస్తున్న ప్రాధాన్యతపై...
సచిన్‌తో నన్ను పోలుస్తూ కొంత మంది వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. క్రికెట్‌ వేరు, సచిన్‌ స్థాయి వేరు. అయితే బ్యాడ్మింటన్‌ విలువ చాలా పెరిగిందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. ముఖ్యంగా గత ఏడాది నేను రియోలో ఒలింపిక్స్‌ పతకం సాధించిన తర్వాత ఈ సంవత్సర కాలంలో పరిస్థితులు చాలా మారిపోయాయి. ఈ ఆటలో మరింత మెరుగైన ఫలితాల కోసం అంతా ఎదురు చూస్తున్నారు. భారత్‌లో కూడా పెరిగిన క్రేజ్‌ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అసలు ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో నేను, సైనా నెహ్వాల్‌ తలపడతామని కూడా చాలా మంది అనుకున్నారు. ఈ సారి జరగకపోయినా అది ఎప్పుడైనా సాధ్యమే.  

ఫైనల్‌ తర్వాత వేడుకలపై...
ఓటమి తర్వాత బాగా నిరాశ చెందాను. బహుమతి ప్రదానోత్సవానికి అందరితో కలిసి వెళ్లే సమయానికి కాస్త కోలుకోగలిగాను. తర్వాతి రోజు మాత్రం అంతా సాధారణంగా మారిపోయింది. ఆటలో ఏదీ అసాధ్యం కాదని అప్పుడు నాకు నేను గట్టిగా చెప్పుకున్నాను. అయితే ఫైనల్లో తీవ్రంగా అలసిపోవడంతో పాటు సమయాభావం కారణంగా ప్రత్యేకంగా సంబరాలు చేసుకునే అవకాశం కలగలేదు. ఇప్పుడు ఆ లోటును పూర్తి చేసుకుంటానేమో! 

మరిన్ని వార్తలు