అదొక చెత్త ప్రతిపాదన: వకార్‌ యూనిస్‌

28 Apr, 2020 11:29 IST|Sakshi

కరాచీ: బాల్‌ ట్యాంపరింగ్‌ను చట్టబద్ధం చేయాలనే యోచనలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)పై పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ వకార్‌ యూనిస్‌ ధ్వజమెత్తాడు. ఇదొక అర్థంలేని ప్రతిపాదనగా వకార్‌ అభివర్ణించాడు. ఈ తరహా ప్రతిపాదననతో క్రికెట్‌ను ఎక్కడికి తీసుకెళదామని ఐసీసీ అనుకుంటుంలో తెలియడం లేదంటూ విమర్శించాడు. బంతిపై లాలాజలం(సలైవా)ను పదే పదే రుద్దడం మనకు సుపరిచితం. కాగా, కరోనా వైరస్‌ కారణంగా సలైవాను బంతిపై రుద్దడాన్ని ఆపేయాలని ఐసీసీ చూస్తోంది. అదే సమయంలో బంతిని పాలిష్‌ చేసేందుకు వేరే ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడింది. దీనిలో భాగంగా బంతిని వేరే రకంగా ట్యాంపర్‌ చేయడానికి అనుమతి ఇవ్వాలని చూస్తోంది. దీనిపై వకార్‌ యూనిస్‌ విమర్శలు గుప్పించాడు.

‘ ఒక ఫాస్ట్‌ బౌలర్‌గా నేను ఇందుకు వ్యతిరేకం. బంతిపై ఉమ్మిని రుద్దడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. ఇది ఒక అలవాటుగా వస్తోంది. బంతిని ఒకరి దగ్గర్నుంచి ఒకరికి మార్చుకుంటూ బౌలర్‌ చేతికి ఇచ్చే క్రమంలో సలైవాను రుద్దడం ఆనవాయితీగా వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్‌గా అంపైర్ల సమక్షంలో వేరు పద్ధతిలో ట్యాంపరింగ్‌ చేయడం కరెక్ట్‌ కాదు. ఈ చర‍్చ అనేది ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. ఇది కచ్చితంగా తప్పే. లాక్‌డౌన్‌లో ఉన్న ప్రజలకు ఈ ప్రతిపాదన చిరాకు తెప్పిస్తోంది. ఇది అనాలోచిత నిర్ణయం. సలైవా ప్లేస్‌లో కృత్రిమ పద్ధతిలో కొత్త పద్ధతిని తీసుకురావడం అనేక అనుమానాలకు తెరతీస్తుంది’ అని వకార్‌ పేర్కొన్నాడు.(నాకు సచిన్‌ వార్నింగ్‌ ఇచ్చాడు..: గంగూలీ)

టెస్టుల్లో కేవలం ఆరంభ ఓవర్లలో మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా బ్యాట్స్‌మెన్‌కు, బౌలర్లకు మధ్య సమమైన పోరు జరగాలంటే బంతిని షైన్‌ చేయడం తప్పనిసరి. లేదంటే బ్యాట్స్‌మెన్‌ చితక్కొడతారు. తమ కెరీర్‌ నరకప్రాయమవుతుందని ఇటీవలే ఆసీస్‌ పేసర్‌ కమిన్స్‌ కూడా అభిప్రాయపడ్డాడు. టాంపరింగ్‌ను ఐసీసీ నిషేధించినా... మ్యాచ్‌ చేజారిపోతున్న దశలో చాలా మంది వేర్వేరు వస్తువులతో బంతి ఆకారాన్ని మారుస్తుంటారు. స్మిత్, వార్నర్‌ ఉదంతంలో స్యాండ్‌ పేపర్‌ (ఉప్పు కాగితం) వాడగా...గతంలో సీసా బిరడా, చెట్టు జిగురు, వ్యాస్‌లీన్, ప్యాంట్‌ జిప్, జెల్లీ బీన్స్, మట్టి... ఇలా కాదేది టాంపరింగ్‌కు అనర్హం అన్నట్లుగా ఎన్నో ఘటనలు జరిగాయి. అయితే ఇప్పుడు ఐసీసీ ఏదైనా ఒక ప్రత్యేక పదార్థాన్ని అధికారికంగా టాంపరింగ్‌కు వాడేలా ఎంపిక చేయాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వాడుతున్న మూడు రకాల బంతులు ఎస్‌జీ, కూకాబుర్రా, డ్యూక్స్‌లన్నింటిపై ఒకే రకంగా పనిచేసేలా ఆ పదార్థం ఉండాలనేది కీలక సూచన. ఈ రకంగా చూస్తే బంతి మెరుపు కోసం లెదర్‌ మాయిశ్చరైజర్, మైనం, షూ పాలిష్‌ కొంత వరకు మెరుగ్గా ఫలితమిచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలనలో తేలింది.(‘బాల్‌ టాంపరింగ్‌ చేసుకోవచ్చు’)

మరిన్ని వార్తలు