కోహ్లి x ధావన్

24 Dec, 2014 01:12 IST|Sakshi
కోహ్లి x ధావన్

డ్రెస్సింగ్ రూమ్‌లో గొడవ పడ్డ భారత క్రికెటర్లు
 సర్ది చెప్పిన రవిశాస్త్రి
 సంచలనం రేపిన ఘటన
 ఆటలో ‘అనిశ్చితి’కి అసలు కారణం!

 
 బ్రిస్బేన్ టెస్టులో ఓటమి తర్వాత భారత కెప్టెన్ ధోని మాట్లాడుతూ...‘కాస్త అనిశ్చితి నెలకొనడం వల్లే ధావన్ ముందుగా బ్యాటింగ్‌కు రాలేకపోయాడు. కోహ్లి హడావిడిగా వెళ్లాల్సి వచ్చింది. మేం ఈ విషయంలో మరింత మెరుగ్గా వ్యవహరించాల్సింది. డ్రెస్సింగ్ రూమ్‌లో తుఫాన్ ఏమీ రాలేదు. కాస్త నిశ్శబ్దం ఉండింది. అన్నీ చక్కబెట్టే సరికి కాస్త సమయం పట్టింది’ అని వ్యాఖ్యానించాడు.
 
 కానీ నిజంగానే తుఫాన్ వచ్చింది. అయితే అది వెలసిపోయేలోగా, అన్నీ మాట్లాడి చక్కబడేలోగా జట్టు ప్రదర్శన కూడా దెబ్బతింది. ఫలితమే మ్యాచ్‌లో అనూహ్య ఓటమి. మైదానంలో ఆటకు ముందే రూమ్‌లో గొడవ కూడా జరిగిందని ఇప్పుడు బయటపడింది. నాలుగో రోజు క్రీజులోకి వెళ్లే విషయంలో కోహ్లి, ధావన్ మాటామాటా అనుకున్నారని తెలిసింది. సహచరుల మధ్య జరిగిన ఈ ఘటన సంచలనానికి కారణమైంది. ఆసీస్ గడ్డపై మన పరువు తీసింది!

 
 మెల్‌బోర్న్: సాధారణంగా భారత కెప్టెన్ ధోని మీడియాతో తాను మాట్లాడే విషయంలో, పదాల అమరికలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. కానీ ‘గాబా’ ఓటమి అనంతరం అతను రెండు సార్లు డ్రెస్సింగ్ రూమ్ ‘అనిశ్చితి’ గురించి మాట్లాడాడు. ప్రాక్టీస్ పిచ్‌ల గురించి ఫిర్యాదు చేసినట్లు కనిపించినా... దానిని గట్టిగా కూడా చెప్పలేకపోయాడు. కాబట్టి తను చెప్పలేనిదేదో జరిగిందని కెప్టెన్‌కూ తెలుసు. జాతీయ మీడియా కథనం ప్రకారం డ్రెస్సింగ్ రూమ్‌లో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్ మధ్య గొడవ జరిగిందని సమాచారం. దీనిపై టీమ్ మేనేజిమెంట్ ఎలాంటి వివరణా ఇవ్వలేదు.
 అసలే జరిగింది...
 బ్రిస్బేన్ టెస్టులో మూడో రోజు ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న పుజారా, ధావన్ తర్వాతి రోజు ఆటను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఆ రోజు ఉదయం ప్రాక్టీస్ సెషన్‌లో ధావన్‌కు గాయమైంది. అయితే ఆట మరో పది నిమిషాల్లో ప్రారంభం కావాల్సి ఉండగా ధావన్ తన మణికట్టుకు గాయమైందని, తాను ఇప్పుడే ఆడలేనంటూ చెప్పేశాడు. దాంతో హడావిడిగా తర్వాతి బ్యాట్స్‌మన్ కోహ్లి మైదానంలోకి వెళ్లాడు. క్రీజ్‌లో అతను అసహనంగా కనిపిస్తున్నాడని టీవీ కామెంటేటర్లు కూడా ఆ సమయంలో వ్యాఖ్యానించడం విశేషం. మొత్తానికి 11 బంతులు మాత్రమే ఎదుర్కొన్న కోహ్లి ఒక పరుగు మాత్రమే చేసి జాన్సన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అది భారత్ పతనానికి దారి తీసింది.
 
 విరుచుకుపడ్డ విరాట్...
 తన ఆటతోనే కాకుండా నోటి దురుసుతనంతో కూడా గతంలో కోహ్లి అనేక సార్లు విమర్శలకు గురయ్యాడు. కొంత కాలంగా వివాదాలకు దూరంగా ఉంటున్నా... ఈ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత అతనిలోని ‘అసలు’ మనిషి బయటికి వచ్చాడు. తన వైఫల్యానికి అతను శిఖర్‌ను తప్పు పట్టాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు రాగానే ధావన్‌పై విరుచుకుపడి ఎడాపెడా తిట్టేశాడు. తన సహచర ఢిల్లీ క్రికెటర్ అంకితభావాన్ని ప్రశ్నించాడు. అసలు ధావన్‌ది ఉత్తుత్తి గాయమేనని, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోలేకనే కూర్చుండిపోయాడని తీవ్రంగా వ్యాఖ్యానించాడు.
 
 ధావన్ జవాబు...
 కోహ్లి మాటలు ధావన్‌కు ఆగ్రహం తెప్పించాయి. తాను అలా తలదించుకునే పని చేయనని, భారత్‌కు ఆడటాన్ని గర్వంగా భావిస్తానని చెప్పాడు. తన ఆటపై నమ్మకం లేకపోతే స్వచ్ఛం దంగా కూర్చుంటానే తప్ప... తప్పుడు కారణాలతో తప్పించుకోనని బదులిచ్చాడు. తన అంకితభావాన్ని ప్రశ్నించడంపై కూడా ధావన్ ఘాటుగా సమాధానమిచ్చినట్లు తెలిసింది.
 
 వేడెక్కిన వాతావరణం...
 మొత్తానికి ఇద్దరు భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో గొడవ పెట్టుకోవడం ఒక్కసారిగా వాతావరణాన్ని వేడెక్కించింది. ఇతర ఆటగాళ్లకు కూడా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చివరకు టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి కల్పించుకోవాల్సి వచ్చింది. ముందుగా ఇద్దరికీ సర్ది చెప్పిన ఆయన ఆ తర్వాత కోహ్లికి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ‘ఏ ఆటగాడైనా, ఎంత గొప్పవాడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలి’ అని శాస్త్రి చెప్పారు. ఇదంతా చక్కబడేసరికి భారత బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వెళ్లడం, టపాటపా వికెట్లు కోల్పోవడం వరుసగా జరిగాయి.
 
 స్పష్టత లేని మేనేజిమెంట్ ...
 ఇదే సమయంలో టీమ్ మేనేజిమెంట్ హడావిడిగా ప్రాక్టీస్ పిచ్ బాగా లేదంటూ పై ప్రకటన విడుదల చేసింది. ఇందులో కూడా గందరగోళం కనిపించింది. ముందు కోహ్లి కుడి మోచేతికి గాయం అని, ఆ తర్వాత దాన్ని ఎడమ చేతికి గాయంగా మార్చింది! మ్యాచ్ తర్వాత ధావన్ అంశంపై విచారణ అంటూ హడావిడి చేసింది కూడా ఇందులో భాగంగానే అనిపించింది. ప్రస్తుతానికి కోహ్లి, ధావన్ వివాదం ముగిసినా మిగిలిన సిరీస్‌పై దీని ప్రభావం ఉంటుందనడంలో సందేహం లేదు.
 
 గతంలోనూ ఇలాగే...
 భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల మధ్య గొడవ, వాదనలు కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే చాలా వరకు అవి బయటికి రాలేదు. కొన్ని మాత్రం అవి పుకార్లను దాటి అందరి దృష్టిలో పడ్డాయి. వాటిని చూస్తే...
 
 సిద్ధూ xఅజహరుద్దీన్
 1996లో ఇంగ్లండ్ పర్యటన
 తొలి టెస్టు ప్రారంభం కావడానికి ముందే కెప్టెన్ అజహరుద్దీన్‌తో డ్రెస్సింగ్ రూమ్‌లో నవజ్యోత్ సిద్ధూకు గొడవ జరిగింది. దాంతో ఈ సర్దార్జీ ఆగ్రహంతో వెంటనే తట్టాబుట్టా సర్దుకొని భారత్‌కు వచ్చేశాడు. అజహర్ వ్యాఖ్యలు సిద్ధూని బాధించాయని వార్తలు వచ్చినా... సరిగ్గా ఏం జరిగిందో ఆ సమయంలో ఎవరూ చెప్పలేదు. అయితే కమిటీ విచారణ సందర్భంగా అజహర్ మాటను సిద్ధూ పొరపాటున తిట్టుగా భావించడం వల్లే ఇది జరిగిందని తర్వాత తేలింది.
 
 సెహ్వాగ్ xజాన్ రైట్
 2002లో ఇంగ్లండ్ పర్యటన
 ఓవల్ వన్డేలో సెహ్వాగ్ సెంచరీ చేయాలని కోచ్ జాన్ రైట్ కోరుకున్నారు. అయితే అతను ఎప్పటిలాగే తనదైన శైలిలో గాల్లో బంతి లేపి అవుట్ కావడం ఆయనకు అమితాగ్రహం తెప్పించింది. ఆవేశంతో జాన్‌రైట్, వీరూ చెంప ఛెళ్లుమనిపించారు. దాంతో భారత జట్టుకు ఆగ్రహం వచ్చింది. కెప్టెన్ గంగూలీ సహా అంతా రైట్ క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. చివరకు సచిన్ జోక్యం చేసుకొని రైట్‌ను తండ్రిలా భావించాలని చెప్పడంతో సద్దుమణిగింది.
 
 సచిన్ xద్రవిడ్
 2004లో పాకిస్తాన్ పర్యటన
 ఈ వివాదం జగద్విఖ్యాతం. ముల్తాన్ టెస్టులో తాను 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ ద్రవిడ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం సచిన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దాంతో డ్రెస్సింగ్ రూమ్‌లో సచిన్, ద్రవిడ్‌పై తన కోపాన్ని వెళ్లగక్కాడు. ఎవరెన్ని రకాలుగా చెప్పినా సచిన్ మనసులో అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోయింది. తన తాజా పుస్తకంలో కూడా అతను దీనిని వెల్లడించాడు.
 

మరిన్ని వార్తలు