స్మిత్‌కు అతనే సరైనోడు: వార్న్‌

10 Aug, 2019 15:02 IST|Sakshi

లండన్‌:  ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ టెస్టు అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా బుధవారం లార్డ్స్‌ వేదికగా ఆరంభం కానున్న రెండో టెస్టులో ఆర్చర్‌ ఆడటం దాదాపు ఖాయంగానే కనబడుతోంది. ఇంగ్లండ్‌ ప్రధాన పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ గాయం కారణంగా రెండో టెస్టుకు సైతం దూరం కావడంతో ఆర్చర్‌ తుది జట్టులో ఎంపికకు మార్గం సుగుమమైంది. తొలి టెస్టుకు ఎంపిక చేసిన జట్టులోనే ఆర్చర్‌ ఉన్నప్పటికీ, చిన్నపాటి గాయం కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకోలేపోయాడు. అయితే సెకండ్‌ ఎలెవన్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లిష్‌ కౌంటీ జట్టు ససెక్స్‌ తరఫున ఆడిన ఆర్చర్‌ ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో చెలరేగిన ఆర్చర్‌.. బ్యాటింగ్‌లో శతకంతో ఆకట్టుకున్నాడు. దాంతో అతని ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు.

ఫలితంగా రెండో టెస్టు కోసం ప్రకటించిన 12 మంది సభ్యులతో కూడిన జట్టులో ఆర్చర్‌ తిరిగి చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే యాషెస్‌ తొలి టెస్టులో రెండు భారీ శతకాలు సాధించి ఆసీస్‌ ఘన విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టీవ్‌ స్మిత్‌ను నిలువరించాలంటే ఆర్చర్‌ను రంగంలోకి దింపాలన్నాడు.  ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్చర్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమని వార్న్‌ అభిప్రాయపడ్డాడు. స్మిత్‌ చాలెంజ్‌కు ఇంగ్లండ్‌ ధీటుగా బదులివ్వాలంటే ఆర్చర్‌ రంగ ప్రవేశం అనివార్యమన్నాడు.

‘ స్మిత్‌ను నిలువరించే ప్రణాళిక ఆర్చర్‌ వద్ద కచ్చితంగా ఉంటుంది. సుమారు 145 కి.మీ వేగంతో బంతుల్ని ఆర్చర్‌ సంధిస్తున్నాడు. ఆర్చర్‌ సవాల్‌ను స్మిత్‌ ఎదుర్కోవడం కష్టమే. రెండో టెస్టుకు అండర్సన్‌ దూరమయ్యాడు. దాంతో ఆర్చర్‌ అవసరం ఇంగ్లండ్‌కు ఉంది. అతని బౌలింగ్‌లో వేడి ఏమిటో ఇప్పటికే చూపించాడు. అంతకముందు స్మిత్‌-ఆర్చర్‌లు ఇద్దరూ ఒకే నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశారు. ఐపీఎల్‌లో ఇద్దరూ రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడారు.  దాంతో స్మిత్‌ ఆట తీరుపై ఆర్చర్‌కు ప్రణాళిక ఉంటుంది.  ఆర్చర్‌ ఎక్స్‌ట్రా పేస్‌తో బ్యాట్స్‌మెన ఇబ్బందులు పెడతాడు. దాంతో పాటు అతని బౌలింగ్‌లో వేగం కూడా నియంత్రణలో ఉంటుంది. యాషెస్‌లో మంచి ఫామ్‌లో ఉన్న స్మిత్‌ను ఆపాలంటే ఆర్చర్‌ సరైనోడు’ అని వార్న్‌ తెలిపాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు