వార్నర్‌ ఆరంభం అదరహో

24 Mar, 2019 17:46 IST|Sakshi

కోల్‌కతా: ఇండియన్‌ ప‍్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. డేవిడ్‌ వార్నర్‌ రీ ఎంట్రీలో అదరగొట్టి సన్‌రైజర్స్‌ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేసి తానెంత విలువైన ఆటగాడినో మరోసారి చాటిచెప్పాడు. ఇది వార‍్నర్‌కు ఐపీఎల్‌లో 40వ హాఫ్‌ సెంచరీ.  ఐపీఎల్‌ అత్యధిక హాఫ్‌ సెంచరీలు సాధించిన ఘనత వార‍్నర్‌దే కావడం విశేషం. మరొకవైపు కేకేఆర్‌పై అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో వార‍్నర్‌ టాప్‌ ప్లేస్‌కు ఎగబాకాడు. ఐపీఎల్‌లో కేకేఆర్‌పై వార‍్నర్‌ సాధించిన పరుగులు 761.ఈ క్రమంలోనే రోహిత్‌ శర్మ(757) రికార్డును వార‍్నర్‌ అధిగమించాడు.
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ను డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టోలు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత బెయిర్‌ స్టో(39; 35 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) పెవిలియన్‌ చేరాడు. అనంతరం వార‍్నర్‌కు జత కలిసిన విజయ్‌ శంకర్‌ స్కోరు బోర్డును చక్కదిద్దాడు. కాగా, ఈ జోడి 26 పరుగులు జత చేసిన తర్వాత వార్నర్ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. కాసేపటికి యూసఫ్‌ పఠాన్‌(1) కూడా ఔట్‌ కావడంతో సన్‌రైజర్స్‌ 152 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. అయితే విజయ్‌ శంకర్‌(40 నాటౌట్‌; 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచితంగా ఆడటంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు