వార్నర్‌-బెయిర్‌ స్టో జోడి మరో రికార్డు

21 Apr, 2019 19:02 IST|Sakshi

హైదరాబాద్‌: ఇప్పటికే ఓవరాల్‌ ఐపీఎల్‌లో అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా నిలిచిన డేవిడ్‌ వార్నర్‌-బెయిర్‌ స్టోలు..తాజాగా మరో ఘనతను కూడా సాధించారు. ఉప్పల్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న  మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓపెనర్లు వార్నర్‌-బెయిర్‌ స్టోలు వందకు పైగా ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా ఒక సీజన్‌లో అత్యధిక పరుగుల సాధించిన ఓపెనింగ్‌ జోడిగా కొత్త రికార్డు నెలకొల్పారు.  ఈ క్రమంలోనే వార్నర్‌-ధావన్‌ల గత రికార్డు తెరమరుగైంది.

2016 సీజన్‌లో వార్నర్‌-ధావన్‌ల జోడి 731 పరుగులు సాధించారు. ఇదే ఇప్పటివరకూ ఐపీఎల్‌లో ఓపెనింగ్‌ జోడి సాధించిన అత్యధిక పరుగులు కాగా, దాన్ని బెయిర్‌ స్టోతో కలిసి ఈ సీజన్‌లో వార్నరే సవరించడం విశేషం. ఇక టాప్‌-4 ఓపెనింగ్‌ భాగస్వామ్యాల్ని చూస్తే మూడింట వార్నర్‌-ధావన్‌ల జోడినే ఉంది. 2015లో వార్నర్‌-ధావన్‌ల జోడి 646 పరుగులు సాధించగా, 2017లో 655 పరుగులు సాధించారు.

ఇక 2014 నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడుతున్న వార్నర్‌(2018 సీజన్‌లో ఆడలేదు) ప్రతీ సీజన్‌లోనూ ఐదు వందలకు పైగా పరుగులు సాదించిన ఘనత సాధించాడు. 2014 సీజన్‌లో 528 పరుగులు సాధించిన వార్నర్‌, 2015లో 562 పరుగులు, 2016లో 848 పరుగులు, 2017లో 641 పరుగులు సాధించాడు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే ఐదు వందలకు పైగా పరుగులు నమోదు చేసి టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో వార్నర్‌(67; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో సన్‌రైజర్స్‌ 131 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.

మరిన్ని వార్తలు