వార్నర్‌ మెరుపు సెంచరీ

29 Dec, 2016 00:00 IST|Sakshi
వార్నర్‌ మెరుపు సెంచరీ

ఆస్ట్రేలియా 278/2
అజహర్‌ అలీ డబుల్‌ సెంచరీ    


మెల్‌బోర్న్‌:  డేవిడ్‌ వార్నర్‌ (143 బంతుల్లో 144; 17 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుత సెంచరీతో పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా దీటైన జవాబిచ్చింది. మ్యాచ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 278 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖాజా (95 బ్యాటింగ్‌; 13 ఫోర్లు) శతకానికి చేరువలో నిలిచాడు. వహాబ్‌ రియాజ్‌ బౌలింగ్‌లో 81 పరుగుల వద్ద బౌల్డ్‌ అయినా అది నోబాల్‌ కావడంతో బతికిపోయిన వార్నర్, కెరీర్‌లో 17వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియా మరో 165 పరుగులు వెనుకబడి ఉండగా, క్రీజ్‌లో ఖాజాతో పాటు స్మిత్‌ (10 బ్యాటింగ్‌) ఉన్నాడు.

అజహర్‌ అలీ రికార్డుల జోరు...
అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 310/6తో ఆట ప్రారంభించిన పాకిస్తాన్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 443 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. చివరి వరకు అజేయంగా నిలిచిన ఓపెనర్‌ అజహర్‌ అలీ (205 నాటౌట్‌; 20 ఫోర్లు) డబుల్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతనికి సొహైల్‌ ఖాన్‌ (65; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు వేగంగా 19.5 ఓవర్లలోనే 118 పరుగులు జత చేయడం విశేషం. లయోన్‌ బౌలింగ్‌లోనే సొహైల్‌ నాలుగు సిక్సర్లు బాదాడు. ఇటీవలే వెస్టిండీస్‌పై ట్రిపుల్‌ సెంచరీ సాధించిన అజహర్‌... ఒకే ఏడాది రెండుసార్లు 200కుపైగా స్కోరు చేసిన, ఆసీస్‌ గడ్డపై డబుల్‌ సెంచరీ చేసిన తొలి పాక్‌ ఆటగాడిగా నిలిచాడు. మెల్‌బోర్న్‌లో ఒక విదేశీ ఓపెనర్‌ డబుల్‌ సెంచరీ చేయడం కూడా ఇదే మొదటిసారి. 

మరిన్ని వార్తలు