రోహిత్ తో వివాదంపై వార్నర్ స్పందన..

20 Oct, 2017 11:20 IST|Sakshi

న్యూఢిల్లీ:భారత్-ఆస్ట్రేలియాల పోరు అంటే వివాదం లేకుండా సాగడం కష్టమే. గత కొన్నేళ్లుగా ఇది మరీ ఎక్కువగా కనబడుతోంది. ఈ ఏడాది ఆరంభంలో ఆసీస్-భారత జట్ల మధ్య జరిగిన సిరీస్ ఎన్నో వివాదాలకు తావిచ్చింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ వివాదం ఒకటైతే, తమకు ఆస్ట్రేలియా జట్టులో శాశ్వత స్నేహితులు లేరంటూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు మరొకటి. ఈ రెండు వివాదాలు అప్పట్లో బాగానే వార్తల్లో నిలిచాయి. ఇదిలా ఉంచితే, అంతకుముందు 2014-15 సీజన్ లో ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. భారత పర్యటనలో భాగంగా రోహిత్ శర్మపై వార్నర్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు అప్పుడు వార్తలు వెలుగుచూశాయి. దానిపై ఆ సమయంలోనే వివరణ ఇచ్చిన డేవిడ్ వార్నర్ మరొకసారి దానిపై స్పందించాడు. యాషెస్ సిరీస్ కు సన్నద్ధమవుతున్న తరుణంలో ఇంగ్లండ్ జట్టుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రోహిత్ శర్మ-డేవిడ్ వార్నర్ ల వివాదం మరొకసారి ప్రస్తావనకు వచ్చింది.

దీనిపై స్పందించిన వార్నర్.. ' మ్యాచ్ జరుగుతున్న సమయంలో రోహిత్ హిందీలో ఏదో మాట్లాడాడు. ఇంగ్లిష్ లో మాట్లాడమని నేను చెప్పా. ఎందుకంటే అతను నా గురించి మాట్లాడితే నాకూ అర్థం కావాలి కదా. దానిలో భాగంగానే అతన్ని ఇంగ్లిష్ మాట్లాడమని చెప్పా. అతను ఏమి అన్నాడో అటు తరువాత నేనేమీ మాట్లాడానో వీడియోల్లో చూడండి. నేను మాట్లాడింది ఏమిటో నా పెదవుల కదలికల్ని బట్టి అర్థమవుతుంది. దానిపై ఎటువంటి సమస్య వచ్చిన ఎదుర్కోవడానికి నేను సిద్ధమే. నేను ఎటువంటి జాతి వివక్ష వ్యాఖ్యలు చేయలేదు'అని వార్నర్ మరోసారి వివరణ ఇచ్చాడు.

వార్నర్‌కు అంత కోపమా.. ఆ మాటలెందుకు!

మరిన్ని వార్తలు