డేవిడ్‌ వార్నర్‌ భారీ సెంచరీ

22 Nov, 2019 16:12 IST|Sakshi

బ్రిస్బేన్‌:  పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ భారీ సెంచరీ సాధించాడు. శుక్రవారం రెండో రోజు ఆటలో భాగంగా వార్నర్‌ అజేయంగా 151 పరుగులు చేశాడు.  ఆసీస్‌కు ఓపెనర్లు జో బర్న్స్‌(97), వార్నర్‌లు శుభారంభం అందించారు. బర్న్స్‌ తృటిలో సెంచరీ కోల్పోగా వార్నర్‌ మాత్రం శతకం పూర్తి చేసుకున్నాడు. దాంతో ఆసీస్‌ వికెట్‌ నష్టానికి 312 పరుగులు చేసింది. వార్నర్‌కు జతగా లబూషేన్‌(55 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్‌ ప్రస్తుతం 72 పరుగుల  ఆధిక్యంలో ఉంది.

అంతకుముందు పాకిస్తాన్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. గురువారం తొలి రోజు ఆటలోనే పాకిస్తాన్‌ తన మొదటి ఇన్నింగ్స్‌ను ముగించింది. అదే సమయంలో తొలి రోజు ఆట కూడా ముగిసింది. ఆపై ఆసీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. వార్నర్‌-బర్న్స్‌లు నిలకడగా ఆడి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 222 పరుగుల భాగస్వామ్యం జత చేసిన తర్వాత బర్న్ష్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత లబూషేన్‌తో కలిసి వార్నర్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడి అజేయంగా 90 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పింది. కాగా, బాల్‌ ట్యాంపరింగ్‌  ఆరోపణలతో ఏడాది నిషేధం ఎదుర్కొని పునరాగమనం చేసిన వార్నర్‌.. యాషెస్‌ సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. నిషేధం తర్వాత టెస్టుల్లో వార్నర్‌కు  ఇదే తొలి సెంచరీ.

>
మరిన్ని వార్తలు