వార్నర్‌కు పాంటింగ్‌ క్లాస్‌!

17 Aug, 2019 10:39 IST|Sakshi

లండన్‌:  ఏడాది పాటు నిషేధం ఎదుర్కొని యాషెస్‌ సిరీస్‌ ద్వారా టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చిన ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వరుసగా వైఫల్యం చెందడంపై అసిస్టెంట్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారీ స్కోర్లు చేసే అవకాశం వార్నర్‌ ముందున్నా, దానిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం కావడం యాజమాన్యాన్ని నిరాశకు గురి చేస్తుందన్నాడు. ముందు ఒత్తిడిని వదిలి, స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయమని క్లాస్‌ పీకాడు.  

‘వార్నర్‌ యాషెస్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. భారీ స్కోరు సాధించే అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఇది అతడిని నిరాశకు గురిచేసే అంశం. దూరంగా వెళ్తున్న బంతుల్ని అతడు కట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. బంతిని పూర్తిగా అంచనా వేయడంలో విఫలమవ్వడంతో అది ఎడ్జ్‌ తీసుకుంటుంది. దీంతో బంతి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌కు చేరుతుంది. షార్ట్‌ అండ్‌ వైడ్‌ బంతుల్ని అతడు పూర్తి విశ్వాసంతో ఎదుర్కోవాలి. బంతిని బలంగా బాదడానికి ప్రయత్నించాలి. ఒత్తిడికి లోనవ్వకుండా బంతిని అంచనా వేస్తూ బ్యాటింగ్‌ చేయాలి’ అని రికీ పేర్కొన్నాడు.  యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టులో 2పరుగులు, 8 పరుగులు మాత్రమే చేసిన వార్నర్‌.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. దూరంగా వెళ్తున్న బంతుల్ని ఆడటానికి యత్నించి విఫలం కావడంతో దానిని మార్చుకోమని పాంటింగ్‌ సూచించాడు.

మరిన్ని వార్తలు