వార్నర్‌ డబుల్‌ సెంచరీ మెరుపులు

30 Nov, 2019 10:19 IST|Sakshi

అడిలైడ్‌: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 302/1 ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా లబూషేన్‌(162) వికెట్‌ను కోల్పోయింది. లబూషేన్‌ భారీ సెంచరీ చేసిన తర్వాత రెండో వికెట్‌గా కోల్పోయాడు.  కాగా, డేవిడ్‌ వార్నర్‌ మాత్రం తొలి రోజు దూకుడునే కొనసాగించాడు. తొలి రోజు ఆటలో సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్‌.. రెండో రోజు ఆటలో డబుల్‌ సెంచరీ మార్కును చేరాడు. 166 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ కొనసాగించిన వార్నర్‌ సమయోచితంగా ఆడి ద్విశతకం నమోదు చేశాడు. ఇది వార్నర్‌కు రెండో టెస్టు డబుల్‌ సెంచరీ.

వార్నర్‌-లబూషేన్‌లు 361 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జో బర్న్స్‌ తొలి వికెట్‌గా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లబూషేన్‌.. వార్నర్‌కు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ తొలి టెస్టులో కూడా భారీ సెంచరీలతో మెరవగా, అదే జోరును రెండో టెస్టులో కూడా కొనసాగించారు. ఈ జోడి నిలకడగా ఆడి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఆసీస్‌ 96 ఓవర్లు ముగిసే సరికి తన తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 426 పరుగులతో ఉంది.

>
మరిన్ని వార్తలు