‘ఆ ఫీట్‌ను పాక్‌ రిపీట్‌ చేస్తుంది’

25 Jun, 2019 20:11 IST|Sakshi

వసీమ్‌ అక్రమ్‌

బర్మింగ్‌హమ్‌ : టీమిండియాపై ఓటమి అనంతరం పుంజుకొని దక్షిణాఫ్రికాపై విజయం అందుకున్న పాకిస్తాన్‌ తన తదుపరి మ్యాచ్‌ బలమైన న్యూజిలాండ్‌తో తలపడనుంది. అయితే వరుస విజయాలతో దూసుకపోతున్న కివీస్‌ను ఓడించడం పాక్‌కు సవాల్‌తో కూడుకున్నదే. అయితే కివీస్‌పై పాక్‌ విజయం సాధించి తీరుతుందని ఆ జట్టు మాజీ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌లో ఎటువంటి మార్పుల్లేకుండా విన్నింగ్‌ టీంనే బరిలోకి దింపాలని  వసీం అక్రమ్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు సూచించాడు. 1992 వరల్డ్‌కప్‌ ఫీట్‌ను పాక్‌ జట్టు పునరావృతం చేస్తుందని అక్రమ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. 

పాక్‌కు చెందిన మీడియా చానెల్‌తో అక్రమ్‌ మాట్లాడుతూ .. 1992 వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో ఊపుమీదున్న న్యూజిలాండ్‌ను 7 వికెట్ల తేడాతో పాక్‌ చిత్తుచిత్తుగా ఓడించిన విషయాన్ని ఆక్రమ్‌ గుర్తుచేశాడు. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందని అభిప్రాయపడ్డాడు. అలాగే పాక్‌ జట్టు ఫీల్డింగ్‌లో బాగా మెరుగుపడాలని సూచించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 14 క్యాచ్‌లను నేలపాలు చేసి అత్యధిక క్యాచ్‌లను జారవిడిచిన జట్లలో పాక్‌ తొలి స్థానంలో నిలవడం మంచిది కాదని అక్రమ్‌ హెచ్చరించాడు. పాక్‌ టాపార్డర్‌ రాణిస్తున్నప్పటికీ మిడిలార్డర్‌, లోయర్‌ ఆర్డర్‌ వైపల్యంతో ఓడిపోతున్నామని పేర్కొన్నాడు. ఇక వన్‌డౌన్‌లో వస్తున్న బాబర్‌ అజమ్‌ భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో విఫలమవుతున్నాడని తెలిపాడు.

కాగా, ఇప్పటివరకు పాక్‌ జట్టు 6 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి 5 పాయింట్లతో పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగతా మాడు మ్యాచ్‌లు తప్పక గెలవడమేగాక ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి వస్తోంది. ఇక బుధవారం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా కివీస్‌తో పాక్‌ తలపడనుంది.
  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు