క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వసీం జాఫర్‌

7 Mar, 2020 20:02 IST|Sakshi

ముంబై : భారత వెటరన్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రెండు దశాబ్దాల పాటు క్రికెట్‌ ఆడిన జాఫర్‌ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు శనివారం తెలిపాడు. 2006లో సౌతాఫ్రికాతో సిరీస్‌ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన 42 ఏండ్ల జాఫర్‌ 31 టెస్టులు ఆడి 1,944 పరుగులు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడు ఐదు శతకాలు, 11 అర్ధశతకాలు సాధించాడు. టెస్టుల్లో వెస్టిండీస్‌(212), పాకిస్థాన్‌పై(202) ద్విశతకాలు బాదాడు. చాలాకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న జాఫర్‌ గతేడాది నుంచి బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా కొనసాగుతున్నాడు.ఈ మధ్యనే ఐపీఎల్‌ టీమ్‌ కింగ్స్‌ పంజాబ్‌కు బ్యాటింగ్‌ కోచ్‌గా  నియమితులయ్యాడు. ఈ నేపథ్యంలో శనివారం రంజీ సహా అన్ని ఫార్మాట్ల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు తన ట్విటర్‌ ద్వారా బీసీసీఐకు అధికారిక లెటర్‌ను పంపించాడు. '25 సంవత్సరాలు క్రికెట్‌ ఆడాను.. ఇక ఆటకు గుడ్‌బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది. క్రికెట్‌లో ఇంతగా ఎదగడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి నా కృతజ్ఞతలు. థ్యాంక్యూ బీసీసీఐ, ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌, విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌' అని లేఖలో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ  వసీం జాఫర్‌ ఫోటోను షేర్‌ చేస్తూ.. 'థ్యాంక్యూ వసీం జాఫర్‌.. రంజీ లెజెండ్‌కు ఇవే మా శుభాకాంక్షలు' అని ట్వీట్‌ చేసింది. (కుంబ్లేకు థాంక్స్‌: వసీం జాఫర్‌)

కాగా రంజీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు కూడా జాఫరే కావడం విశేషం.  దేశవాళీ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన జాఫర్‌ ఎంతో మంది యువ క్రీడాకారులతో కలిసి క్రికెట్‌ ఆడాడు.  రంజీ ట్రోఫీలో 12వేల పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. తన క్రికెట్‌ కెరీర్‌లో ఎక్కువకాలం ముంబై జట్టు తరఫున ఆడిన జాఫర్‌.. తర్వాత విదర్భకు ప్రాతినిధ్యం వహించాడు. రంజీ టోర్నీలో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గానూ అరుదైన ఘనత అందుకున్నాడు.1996-97 సీజన్‌లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అరంగేట్రం చేసిన వసీం..మొత్తం 260 మ్యాచ్‌లు ఆడి 19,410 పరుగులు చేయగా.. అందులో 57 శతకాలు, 91 అర్ధశతకాలు ఉన్నాయి. (హార్దిక్‌ నామస్మరణతో మార్మోగిన స్టేడియం)

>
మరిన్ని వార్తలు