ఇది చూశారా.. వైడ్‌తో వికెట్‌ తీసిన కోహ్లి!

9 Jul, 2019 10:33 IST|Sakshi

మాంచెస్టర్‌ :  ప్రపంచకప్‌-2019 టోర్నీ తుది దశకు చేరింది. మెగా టోర్నీలో తొలి రసవత్తపోరుకు రంగం సిద్దమైంది. దేశమంతా క్రికెట్‌ నామస్మరణంతో మారు మోగుతుంది. మరికొద్ది గంటల్లో భారత్‌-న్యూజిలాండ్‌ తొలి సెమీస్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. యాదృశ్చికమో కాకతాళీయమో కానీ 11 ఏళ్ల చరిత్ర పునరావృతమైంది. 2008 అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో తలపడ్డ సారథులే ఈ మెగా టోర్నీలో ఒకరినొకరు ఢీ కొంటున్నారు. అప్పుడు భారత సారథి విరాట్‌ కోహ్లి పైచేయి సాధించగా.. ఇప్పుడు ఎవరు గెలుస్తారనే చర్చ క్రికెట్‌ వర్గాల్లో ఊపందుకుంది. ఈ నేపథ్యంలో నాటి మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. (ఇద్దరు కెప్టెన్లు... వరల్డ్‌కప్‌లో అరుదైన ఘట్టం!)

భారత కెప్టెన్‌ కోహ్లినే స్వయంగా ఆ విషయాన్ని ప్రీ-మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో గుర్తు చేసుకోవడంతో హాట్‌ టాపిక్‌ అయింది. నాటి మ్యాచ్‌లో ఓ వైడ్‌ బంతితో కోహ్లి కివీస్ సారథి విలియమ్సన్‌ను బోల్తా కొట్టించాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తాను చాలా ప్రమాదకరమైన బౌలర్‌నని, అప్పుడు విలియమ్సన్‌నే ఔట్‌ చేసానని గుర్తు చేశాడు.  కాకపోతే తమ బౌలర్లు తమ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, అందుకే బౌలింగ్‌ చేయడం లేదని నవ్వులు పూయించాడు. నెటిజన్లంతా కోహ్లి పడగొట్టిన వికెట్‌ వీడియో కోసం వెతకడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ ట్రెండ్‌ అవుతోంది. మీరు కూడా ఓ సారి కోహ్లి బౌలింగ్‌ టాలెంట్‌ చూసి ఆనందించండి. (చదవండి : లార్డ్స్‌ దారిలో కివీస్‌ అడ్డంకి)

మరిన్ని వార్తలు