వాట్సన్ వీడ్కోలు

7 Sep, 2015 00:39 IST|Sakshi
వాట్సన్ వీడ్కోలు

లండన్ : యాషెస్ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా జట్టుకు మరో స్టార్ ఆటగాడు దూరమయ్యాడు. ఇప్పటికే మైకేల్ క్లార్క్, క్రిస్ రోజర్స్ రిటైర్మెంట్ ప్రకటించగా... తాజాగా సీనియర్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. యాషెస్ తొలి టెస్టులో విఫలమైన 34 ఏళ్ల వాట్సన్‌కు మిగిలిన మ్యాచ్ ల్లో చోటు దక్కలేదు. దీనికి తోడు నిరంతరం వెంటాడుతున్న గాయాల కారణంగా తన పదేళ్ల టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

ఇంగ్లండ్‌తో శనివా రం జరిగిన రెండో వన్డేలో వాట్సన్ గాయపడడంతో ఈ సిరీస్ నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ‘టెస్టులకు గుడ్‌బై చెప్పాల్సిన సమయమిదేనని నాకు తెలుసు. ఈ నిర్ణయం అంత సులువుగా తీసుకోలేదు. గత నెలంతా దీర్ఘంగా ఆలోచించాను. అయితే వన్డే, టి20 ఫార్మాట్‌లో మాత్రం కొనసాగుతాను. ఇన్నాళ్లుగా జట్టు కోసం నా శాయశక్తులా సేవలందిం చాను’ అని క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. వన్డేల్లో విలువైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నా సుదీర్ఘ ఫార్మాట్‌లో వాట్సన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 2005లో అరంగేట్రం చేసిన తను 59 టెస్టులు ఆడాడు. ఓ టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరిం చాడు. 3,731 పరుగుల్లో నాలుగు సెంచరీలుండగా, బౌలింగ్‌లోనూ రాణించి 75 వికెట్లు తీశాడు.

మరిన్ని వార్తలు