ఎర్రకోటలో కొత్త రాజు

8 Jun, 2015 01:24 IST|Sakshi
ఎర్రకోటలో కొత్త రాజు

ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ వావ్రింకా
ఫైనల్లో జొకోవిచ్‌పై అద్భుత విజయం
రూ. 12 కోట్ల 82 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
సెర్బియా స్టార్‌కు మళ్లీ నిరాశ

 
 సౌండ్ చేయకుండా ‘సెలైంట్ కిల్లర్’లా ఫ్రెంచ్ ఓపెన్‌లో స్టానిస్లాస్ వావ్రింకా పెను సంచలనమే సృష్టించాడు. క్వార్టర్ ఫైనల్లో ‘క్లే కింగ్’ రాఫెల్ నాదల్‌ను చిత్తు చేసి... సెమీఫైనల్లో ఆండీ ముర్రే అడ్డంకిని తొలగించుకొని... ఇక ‘ఫ్రెంచ్ కిరీటం’ తనదే అనుకున్న ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఆశలను ఆవిరి చేసి వావ్రింకా ఎర్రకోటలో కొత్త రాజుగా అవతరించాడు. ఇన్నాళ్లూ స్విట్జర్లాండ్ టెన్నిస్ అంటే రోజర్ ఫెడరర్ గుర్తుకొచ్చేవాడు. ఇక నుంచి ఆ స్థానంలో వావ్రింకా పేరు కూడా మదిలో మెదులుతుంది. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తాను విజేతగా నిలువడం గాలివాటమేమీ కాదని ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో వావ్రింకా నిరూపించాడు.

 
 పారిస్ : అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. ‘క్లే కింగ్’ రాఫెల్ నాదల్‌ను మట్టికరిపించిన నొవాక్ జొకోవిచ్‌కు ఫైనల్లో మాత్రం చుక్కెదురైంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఎనిమిదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో వావ్రింకా 4-6, 6-4, 6-3, 6-4తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించాడు. 3 గంటల 12 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో తొలి సెట్‌ను కోల్పోయిన వావ్రింకా ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లను నెగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

విజేతగా నిలిచిన వావ్రింకాకు 18 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 82 లక్షలు), రన్నరప్ జొకోవిచ్‌కు 9 లక్షల యూరోలు (రూ. 6 కోట్ల 41 లక్షలు) లభించాయి.  ఫైనల్ చేరే క్రమంలో కేవలం రెండు సెట్‌లు కోల్పోయిన జొకోవిచ్ అంతిమ సమరంలో తొలి సెట్‌ను నెగ్గి శుభారంభం చేశాడు. ఏడో గేమ్‌లో వావ్రింకా సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని జొకోవిచ్ తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే రెండో సెట్ నుంచి వావ్రింకా పుంజుకున్నాడు. చూడచక్కనైన బ్యాక్‌హ్యాండ్ షాట్‌లు, పదునైన ఏస్‌లతో చెలరేగిన అతను పదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను గెల్చుకున్నాడు. ఆ తర్వాత మూడో సెట్, నాలుగో సెట్‌లోనూ వావ్రింకా కీలకదశల్లో పైచేయి సాధించి జొకోవిచ్ ఓటమిని ఖాయం చేశాడు.
 
విశేషాలు
►1988లో మాట్స్ విలాండర్ (స్వీడన్) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ బాలు ర సింగిల్స్ టైటిల్‌తోపాటు పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన రెండో ప్లేయర్‌గా వావ్రింకా గుర్తింపు పొందాడు. 2003లో వావ్రింకా ఇదే టోర్నీలో జూనియర్ చాంపియన్‌గా నిలిచాడు.
►1990లో ఆండ్రీ గోమెజ్ (ఈక్వెడార్) తర్వాత పెద్ద వయస్సులో (30 ఏళ్లు) ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఆటగాడిగా వావ్రింకా నిలిచాడు.
► 2005లో రాఫెల్ నాదల్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన తొలి ప్రయత్నంలోనే టైటిల్ నెగ్గిన క్రీడాకారుడు వావ్రింకా.
► ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి ‘కెరీర్‌స్లామ్’ సాధించాలని ఆశించిన జొకోవిచ్‌కు మూడోసారీ నిరాశే ఎదురైంది. 2012, 2014లలో నాదల్ చేతిలో ఫైనల్లో ఓడిన జొకోవిచ్‌కు ఈసారి వావ్రింకా షాక్ ఇచ్చాడు.
 
 ‘ఇదో గొప్ప అనుభూతి. గతంలో నేను ఎన్నడూ ఇంత ఉద్వేగానికి గురి కాలేదు. ఇంతకుముందు ఈ మైదానంలో ఫైనల్ ఆడినా విజేత కాలేని నా కోచ్ మాగ్నస్ నార్మన్‌కు ఈ టైటిల్‌ను అంకితం ఇస్తున్నాను’
       -వావ్రింకా
 
‘ఈ సమయంలో మాట్లాడటం నాకు చాలా కష్టంగా ఉంది. ఇదో అద్భుతమైన టోర్నీ. ఈ ట్రోఫీ కోసం వచ్చే ఏడాది కూడా నా పోరాటం కొనసాగిస్తా. చాంపియన్‌లా ఆడిన వావ్రింకాకు నా అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా నాకు మద్దతుగా నిలిచినవారికి కృతజ్ఞతలు’  
      -జొకోవిచ్

మరిన్ని వార్తలు