మరీ ఇంత అధ్వాన్నమా?: కోహ్లి

13 Aug, 2018 08:36 IST|Sakshi
మ్యాచ్‌ ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో విరాట్‌ కోహ్లి

లండన్‌: చెత్తగా ఆడటం వల్లే తాము ఘోర పరాజయం పాలయ్యామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వాపోయారు. లార్డ్స్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత విలేకరులతో అతడు మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో దారుణంగా ఆడిన తమకు గెలిచే అర్హత లేదన్నాడు. ‘మా ఆటతీరు చెత్తగా ఉంది. గత ఐదు టెస్టుల్లో మరీ ఇంత అధ్వాన్నంగా ఆడటం ఇదే తొలిసారి. ఈ టెస్టులో మాకు గెలిచే అర్హత లేదు. పిచ్‌ను నిందించను. ప్రతికూల వాతావరణ పరిస్థితులంటూ సాకులు చెప్పను. పిచ్‌ కుదురుగా ఆడేందుకే అవకాశమిచ్చినా... మొత్తంగా మేం ఏమాత్రం బాగా ఆడలేదంతే! ఆటలోనే కాదు తుది జట్టు కూర్పులోనూ పొరపాటు చేశాం. స్పిన్నర్‌కు బదులు మరో సీమర్‌నే తీసుకోవాల్సింది. నా వెన్నునొప్పి సమస్య కాదు. మూడో టెస్టుకు మరో ఐదు రోజుల విరామముంది. తప్పకుండా కోలుకుంటాన’ని కెప్టెన్‌ కోహ్లి పేర్కొన్నాడు.

మరోవైపు భారీ విజయాన్ని అందించిన  తమ బౌలర్లపై ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్ ప్రశంసలు కురిపించాడు. సమిష్టిగా రాణించి గెలిచామని చెప్పుకొచ్చాడు. ‘తమ జట్టు మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. అండర్సన్, వోక్స్‌ల ప్రదర్శన అసాధారణం. ముఖ్యంగా వోక్స్‌ బాగా ఆడాడు. తానెంత ప్రతిభావంతుడో మరోసారి చాటుకున్నాడు. నిలకడగా కష్టపడుతున్నాడు. నాలుగు రోజుల్లోనే మ్యాచ్‌ ముగియడంతో మూడో టెస్టుకు అదనంగా లభించిన విశ్రాంతి రోజును సద్వినియోగం చేసుకుంటాం. నిజానికి మేం ఇంకా మా పూర్తిస్థాయి ఆటతీరును ప్రదర్శించలేదు. అయినా సిరీస్‌లో మేం మంచి స్థితిలో ఉన్నామ’ని వివరించాడు.

ఎప్పటికీ గుర్తుంటుంది: వోక్స్‌
గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన తర్వాత తాను చేసిన ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నట్టు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అందుకున్న క్రిస్‌ వోక్స్‌ తెలిపాడు. వర్షం కారణంగా ఒక రోజు ఆట పూర్తిగా రద్దయిన తర్వాత కూడా మూడు రోజుల్లోనే తాము గెలిచినందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. సెంచరీతో విఖ్యాత లార్డ్స్‌ మైదానంలోని ఆనర్స్‌ బోర్డులో తన పేరు చూసుకోవడం ఎప్పటికీ గుర్తుండి పోతుందని సంతోషం వ్యక్తం చేశాడు.          

మరిన్ని వార్తలు