‘ఇక టీమిండియాను ఓడించడమే లక్ష్యం’

2 May, 2020 10:31 IST|Sakshi

మెల్‌బోర్న్‌: అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియాను వెనక్కినెట్టి ఆస్ట్రేలియా టాప్‌ను కైవసం​ చేసుకోవడంతో ఆ జట్టు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ఆనందం వ్యక్తం చేశాడు.  42 నెలలు పాటు టాప్‌లో కొనసాగిన టీమిండియా స్థానాన్నిఆసీస్ దక్కించుకోవడం తమ జట్టు సమష్టి కృషికి నిదర్శమన్నాడు. ప్రస్తుతం తమ ముందున్న టార్గెట్‌ టీమిండియాను వారి గడ్డపై ఓడించడమేనని పేర్కొన్నాడు. భారత్‌ను వారి స్వదేశంలో ఓడించడం అత్యంత కఠినమని ఈ సందర్భంగా లాంగర్‌ తెలిపాడు. తాము పర్యటించిన దేశాల్లో భారతే క్లిష్టమనదిగా స్పష్టం చేశాడు. దాంతో భారత్‌ను వారి దేశంలో ఓడించి తమకు తిరుగులేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. తమ జట్టు అగ్రస్థానానికి ఎగబాకడంతో అందరి ముఖాల్లో నవ్వులు కనిపిస్తున్నాయన్నాడు. కాగా, తమ అంతిమ లక్ష్యం మాత్రం వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ను గెలవడమేనన్నాడు. (టీమిండియా ‘అతి పెద్ద’ రికార్డుకు బ్రేక్‌)

ఈ టైటిల్‌ గెలవాలంటే భారత్‌ను వారి దేశంలో ఓడించడమే కాకుండా, తమ దేశంలో కూడా ఓడించాల్సి ఉందన్నాడు. మనం మెరుగైన జట్టు అని నిరూపించుకోవాలంటే పటిష్టమైన జట్టును ఓడించడమే ఒక్కటే మార్గమన్నాడు. శుక్రవారం విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియా 116 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా, న్యూజిలాండ్‌ 115 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక టీమిండియా టీమిండియా 114 రేటింగ్‌ పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది.   2016 అక్టోబర్‌లో అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్న టీమిండియా.. ఇప్పటివరకూ ఆ స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది. 2016-17 సీజన్‌లో 12 టెస్టుల్లో విజయం సాధించిన టీమిండియా.. కేవలం ఒక టెస్టులో మాత్రమే ఓటమి పాలైంది. ఫలితంగా ఆ సీజన్‌లో  టాప్‌ ర్యాంకును కైవసం చేసుకుంది. సుదీర్ఘ కాలం ఆ ర్యాంకులో కొనసాగి గదను సగర్వంగా అందుకుంది. అయితే వార్షిక లెక్కల ప్రకారం 2019 మే నుంచి ఫలితాల్ని పరిగణిస్తారు. ఈ తాజా విజయాలకు 100 శాతం పాయింట్లు, గత రెండేళ్లకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. దీంతో ఆసీస్‌ ముందంజ వేయగా... భారత్‌ మూడో స్థానానికి పడిపోక తప్పలేదు. (బీసీసీఐ... ప్రకటించిన నజరానా ఇవ్వండి)

మరిన్ని వార్తలు