కోహ్లి తన అభిప్రాయం చెప్పవచ్చు కానీ...

2 Aug, 2019 06:18 IST|Sakshi

కోచ్‌ ఎంపికలో అంతిమ నిర్ణయం సీఏసీదే

కపిల్‌దేవ్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఓవైపు టీమిండియా ప్రధాన కోచ్‌ ఎంపిక ప్రక్రియ సాగుతుండగా... ప్రస్తుత హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రిని కొనసాగిస్తే బాగుంటుందంటూ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై ప్రతిస్పందనలు కొనసాగుతున్నాయి. కోచ్‌ ఎంపిక కమిటీ బాధ్యతను చూస్తున్న క్రికెట్‌ సలహా మండలి (సీఏసీ) సభ్యులు, దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్, శాంత రంగస్వామి దీనిపై గురువారం వేర్వేరు చోట్ల మాట్లాడారు. తమ కర్తవ్యాన్ని శక్తిమేర నిర్వర్తిస్తా మని పేర్కొన్న కపిల్‌... కోహ్లి వ్యాఖ్యలపై మాట్లాడుతూ ‘అది అతడి అభిప్రాయం.

మేం ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించాలి’ అని స్పష్టం చేశారు. కెప్టెన్‌గా అభిప్రాయం చెప్పే హక్కు కోహ్లికి ఉందంటూనే, తమ కమిటీ సమష్టి నిర్ణయంతో కోచ్‌ను ఎంపిక చేస్తుందని శాంత రంగస్వామి అన్నారు. అనుభవం, సామర్థ్యం, వ్యూహ నైపుణ్యాలను తాము ప్రాతిపదికగా తీసుకుంటామని చెప్పారు. మరోవైపు కోహ్లి వ్యాఖ్యలు కోచ్‌ ఎంపికపై ప్రభావం చూపవని, ప్రజాస్వామ్య దేశంలో వాక్‌ స్వాతంత్య్రాన్ని ఎవరూ అడ్డుకోలేరని క్రికెట్‌ పాలకుల మండలి (సీవోఏ) సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. కోహ్లి కెప్టెనే అయినా, ఎంపికకు ఒక కమిటీని నియమించిన విషయాన్ని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు