-

అందువల్లే ఓడిపోయాం: డుప్లెసిస్‌

2 Feb, 2018 14:27 IST|Sakshi

డర్బన్‌: ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలుకావడానికి బ్యాటింగ్‌లో విఫలం చెందడమే ప్రధాన కారణమని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ పేర్కొన్నాడు. ఓవరాల్‌గా తమ బ్యాటింగ్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోవడమే భారత్‌తో ఘోర పరాజయం చూడాల్సి వచ్చిందన్నాడు. మ్యాచ్‌ అనంతరం పోస్ట్‌ కాన్పరెన్స్‌లో మాట్లాడిన డుప్లెసిస్‌..' మా బ్యాటింగ్‌ తీవ్రంగా నిరాశపరిచింది. మా బ్యాటింగ్‌ యూనిట్‌లో రెండో అత్యధిక స్కోరు 30 నుంచి 40 పరుగుల మధ్యలో మాత్రమే ఉంది. దాంతో సరైన భాగస్వామ్యాలు నమోదు కాలేదు. ఇదే మా విజయంపై తీవ్ర ప్రభావం చూపింది. వన్డే క్రికెట్‌లో కనీసం ఇద్దరు ఆటగాళ్లు నిలకడైన భాగస్వామ్యాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అది వన్డే క్రికెట్‌లో విజయానికి బేసిక్‌ సూత్రం. దాన్ని మేము సాధించడంలో విఫలం కావడంతోనే ఓటమిని చవిచూశాం' అని డుప్లెసిస్‌ తెలిపాడు.

మరొకవైపు భారత స్పిన్నర్లపై డుప్లెసిస్‌ ప్రశంసలు కురిపించాడు. తమపై టీమిండియా స్పిన్నర్లదే పైచేయిగా నిలిచిందన్నాడు. ఈ పిచ్‌పై కనీసం 300 స్కోరు చేస్తే కాపాడుకోవడం సాధ్యమవుతుందన్నాడు. 260 స్కోరు అనేది ఎంతమాత్రం కాపాడుకునే లక్ష్యం కాదన్నాడు. ఇదే పిచ్‌పై ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 370 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన విషయాన్ని డుప్లెసిస్‌ గుర్తు చేశాడు.  దాంతో భారత్‌తో మ్యాచ్‌లో తమ బౌలర్లను నిందించడం ఎంతమాత్రం సరైనది కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఇంకా 60-70 పరుగులు చేసుంటే అప్పుడు బౌలర్లపై భారం వేసే వాళ్లమని డుప్లెసిస్‌ తెలిపాడు. తొలి వన్డేలో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో సఫారీలను మట్టికరిపించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 270 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 45.3 ఓవర్లలో ఛేదించింది.

మరిన్ని వార్తలు