ఫిల్‌ హ్యూస్‌లా కాకూడదని ప్రార్థించాం: వార్నర్‌

16 Mar, 2020 18:42 IST|Sakshi
గత యాషెస్‌ సిరీస్‌లో బంతి తగిలి ఫీల్డ్‌లో కుప్పకూలిన స్మిత్‌(ఫైల్‌ఫొటో)

సిడ్నీ: గత యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ అద్భుతంగా ఆడాడు. ఆ సిరీస్‌లో మొత్తంగా 774 పరుగులు చేసి రికార్డు బ్యాటింగ్‌తో అలరించాడు. అది కూడా బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంతో ఏడాది పాటు  నిషేధానికి గురై నేరుగా యాషెస్‌ సిరీస్‌లో బరిలోకి దిగిన స్మిత్‌ అంచనాలు మించి రాణించాడు. ఒకవైపు స్మిత్‌ను ఇంగ్లండ్‌ ప్రేక్షకులు హేళన చేస్తున్నా అతను మాత్రం చెదరని ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేశాడు. స్మిత్‌ను పదే పదే టార్గెట్‌ చేసి బాధ పెట్టినా అతను ఎక్కడా కూడా బెదరలేదు కదా.. అదరగొట్టేశాడు. కాగా, యాషెస్‌ సిరీస్‌లోనే స్టీవ్‌ స్మిత్‌.. ఇంగ్లండ్‌  పేసర్ జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. రెండో టెస్టులో 148 కిలోమీటర్ల వేగంతో ఆర్చర్ వేసిన ఓ బౌన్సర్ నేరుగా స్మిత్ తలకు తాకింది.( 'స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్‌గా సరైనోడు కాదు')

దాంతో నొప్పితో విలవిల్లాడి అక్కడే కుప్పకూలిన స్మిత్ రిటైర్డ్‌హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. స్మిత్‌ తలకు అయిన గాయంతో ఆసీస్‌ జట్టు వణికిపోయింది. అది ఇప్పటికీ వారిని భయపెడుతూనే ఉంది. ఎందుకంటే.. 2014లో ఆసీస్‌కు చెందిన ఆటగాడు ఫిల్‌ హ్యూస్‌ షెఫీల్డ్‌ షీల్డ్‌ క్రికెట్‌ ఆడుతూ గాయపడ్డాడు. తలకు బంతి బలంగా తగలడంతో.. అక్కడికక్కడే కుప్పకూలడమే కాకుండా మృత్యువాత పడ్డాడు. దీంతో నాటి నుంచి ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ బౌన్సర్లను ఎదుర్కోవాలంటే కాస్త భయపడుతున్నారు. ఇక స్మిత్‌ తలకు అయిన గాయంతో ఒక్కసారిగా ఆసీస్‌ శిబిరంలో ఆందోళన నెలకొంది.  ఇదే విషయాన్ని సహచర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ తాజాగా స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాలో క్రికెట్‌పై అమెజాన్‌ ప్రైమ్‌ 'ది టెస్ట్‌' అనే డాక్యుమెంటరీ వీడియో విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన వార్నర్‌.. గత యాషెస్‌ అనుభవాలను పంచుకున్నాడు. 'స్మిత్‌ తలకు బంతి తగిలి కిందపడగానే మళ్లీ అలా (ఫిల్‌ హ్యూస్‌) కాకూడదని ప్రార్థించాం. మేమంతా చాలా కంగారు పడ్డాం. స్మిత్‌కు అలాంటి పరిస్థితి రావొద్దని ప్రార్థించాం' అని వార్నర్‌ చెప్పాడు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా