చూశారా.. ఇదే మా సమాధానం: వెస్టిండీస్‌ క్రికెటర్‌

28 Oct, 2018 20:26 IST|Sakshi

పుణె: భారత్‌పై మూడో వన్డేలో విజయం సాధించిన తర్వాత వెస్టిండీస్ ఆటగాళ్లలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది.  తొలి వన్డేలో పోరాడి ఓడిన విండీస్‌.. రెండో వన్డేను టైగా ముగించింది. కాగా, మూడో వన్డేలో ఏకంగా విజయమే సాధించి టీమిండియాకు షాకిచ్చింది. దాంతో విండీస్‌ ఆటగాళ్లు తమ మాటలకు పదునుపెట్టారు.  గత మ్యాచ్‌లలా కాదంటూ.. ఇప్పుడు రెండు వన్డేలలోనూ గెలిచితీరతామనే విధంగా చెప్పుకొస్తున్నారు. భారత్ గడ్డపై వెస్టిండీస్ ప్రదర్శన గురించి అనుమానం వ్యక్తం చేసి తమను విమర్శించిన వారికి ఇటీవల ముగిసిన మూడు వన్డేల్లో మా జట్టు కనబర్చిన ప్రదర్శనే సమాధానమని ఆ జట్టు ఆల్‌రౌండర్ నర్స్ అభిప్రాయపడ్డాడు.

మ్యాచ్‌లో విజయం తర్వాత పోస్ట్‌ మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ..‘ చూశారా.. ఇదే మా సమాధానం. మా జట్టును విమర్శించిన వారు ఇప్పుడేమంటారు.  మూడో వన్డేలో మా జట్టు ఆడిన తీరు అమోఘం. మేము  ఇక్కడకు వచ్చినప్పుడు అండర్‌డాగ్స్‌గానే వచ్చాం. అది కూడా కచ్చితమైన ఆటతో అలరించాలనుకున్నాం. అయితే భారత్‌పై టెస్టు సిరీస్‌ను కోల్పోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మా సత్తా ఏమిటో బయటపడింది కదా’ అంటూ నర్స్‌ వ్యాఖ్యానించాడు.  పుణె వేదికగా శనివారం రాత్రి ముగిసిన మూడో వన్డేలో బ్యాట్‌తో 22 బంతుల్లోనే 4ఫోర్లు, 2సిక్సుల సాయంతో 40 పరుగులు చేసిన నర్స్.. బంతితోనూ శిఖర్ ధావన్ (35), రిషబ్ పంత్ (24) వికెట్లను పడగొట్టాడు. దీంతో.. భారత్‌పై 43 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టు గెలుపొందగా.. కీలక ప్రదర్శన చేసిన నర్స్‌కి ‘మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.

పుణేలో పల్టీ 

ఈ ఘనతా.. అతడికే సొంతం

మరిన్ని వార్తలు