'టీమిండియాకు ముందే లొంగిపోయాం'

25 Jul, 2016 17:59 IST|Sakshi

ఆంటిగ్వా: టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా వైఫల్యం చెందడానికి తమ జట్టు పేలవ ప్రదర్శనే కారణమని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ స్పష్టం చేశాడు. తమ ఓటమిని ఓ వైపు ఉంచితే, అసలు పోరాటం అనేదే కనబరచకుండా వెనుదిరగడం తీవ్రంగా నిరాశకు గురి చేసిందన్నాడు. ఈ పరాజయానికి ప్రధాన కారణం బౌలింగ్లో పూర్తిగా వైఫల్యం చెందడమేనన్నాడు.

 

'టీమిండియాకు ముందే లొంగిపోయాం. అసలు తొలి ఇన్నింగ్స్లో మా బౌలింగ్ సరిగా లేదు.  దాంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. అసలు ప్రత్యర్థి జట్టుపై ఎటువంటి ఒత్తిడి తేలేకపోయాం. ఓ మోస్తరుగా మాత్రమే బౌలింగ్లో రాణించాం. ఇది టెస్టు క్రికెట్ లో సరిపోదు. సుదీర్ఘమైన టెస్టు మ్యాచ్లో బౌలింగ్ అనేది చాలా కీలకం. మా బౌలింగ్ చాలా మెరుగుపడాల్సిన అవసరం చాలా ఉంది. తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టుకు రెండు సెంచరీలు చేసే అవకాశం ఇవ్వడం మా బౌలింగ్లో పసలేకపోవడాన్ని సూచిస్తుంది. తదుపరి మ్యాచ్ నాటికి భారత్ జట్టుకు గట్టి పోటీ ఇస్తామని భావిస్తున్నా'అని హోల్డర్ పేర్కొన్నాడు.

నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.రెండో ఇన్నింగ్స్ లో విండీస్ ను 231 పరుగులకే కుప్పకూల్చిన భారత్ ఇంకా రోజు ఆట మిగిలి ఉండగానే ఇన్నింగ్స్  92 పరుగుల తేడాతో గెలిచింది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏడు వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించాడు.

మరిన్ని వార్తలు