అప్పటివరకు మేం భారత్‌లో ఆడం

26 Feb, 2016 08:46 IST|Sakshi
అప్పటివరకు మేం భారత్‌లో ఆడం

టీమిండియా వచ్చి పాకిస్థాన్‌లో ద్వైపాక్షిక సిరీస్ ఆడేవరకు తాము భారతదేశంలో పర్యటించేది లేదని పాక్ క్రికెట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నజామ్ సేథి స్పష్టం చేశారు. భారతదేశంతో ద్వైపాక్షిక సిరీస్‌ను పునరుద్ధరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే అది పాకిస్థాన్‌ లేదా మరో దేశంలో అయితే ఓకే గానీ భారత్‌లో మాత్రం కాదని ఆయన అన్నారు. ముందుగా తమ దేశంలో ఒక పూర్తిస్థాయి సిరీస్ ఆడితేనే ఆర్థిక నష్టాల నుంచి బయటపడగలమని, భారత్‌తో ఆడకపోవడం వల్ల ఇన్నాళ్లుగా చాలా నష్టపోయామని సేథి చెప్పారు.

మార్చిలో భారత్‌లో జరిగే టి20 వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు పీసీబీకి పాక్ ప్రభుత్వం అనుమతించింది. తమ ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తోందని, కానీ భారతదేశం కూడా తమకిచ్చిన మాటను ముందుగా నిలబెట్టుకోవాలని సేథి కోరారు. ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో 2007 తర్వాత ఇంతవరకు టీమిండియా వెళ్లి పాకిస్థాన్‌లో సిరీస్ ఆడలేదు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో బీసీసీఐ ఈ దిశగా కొంతవరకు ప్రయత్నాలు చేసినా.. ప్రభుత్వం మాత్రం అందుకు అనుమతించలేదు. ముంబై ఉగ్రదాడుల నుంచి ఇటీవల పఠాన్‌కోట్ దాడి వరకు పదే పదే ఉగ్రవాదులకు ఊతం ఇచ్చే చర్యలకు పాక్ పాల్పడుతుండటంతో ఆ దేశంతో ద్వైపాక్షిక సిరీస్.. అదీ వాళ్ల దేశంలో ఆడేందుకు భారత ప్రభుత్వం సుముఖంగా లేదు.

మరిన్ని వార్తలు