‘బీసీసీఐ ప్రయోజనాలను కాపాడతాం’

23 Mar, 2017 00:40 IST|Sakshi
‘బీసీసీఐ ప్రయోజనాలను కాపాడతాం’

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)తో చర్చించేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ బీసీసీఐ ప్రయోజనాలను కాపాడతామని నూతన పరిపాలక కమిటీ (సీఓఏ) స్పష్టం చేసింది. ప్రస్తుతం బోర్డు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యల గురించి మీడియాతో కమిటీ మాట్లాడింది. ఇందులో ఇతర సభ్యులు కూడా పాల్గొన్నారు. ‘భారత క్రికెట్‌ బోర్డు ప్రయోజనాలను మేం త్యాగం చేయమని కచ్చితంగా చెబుతున్నాము. బోర్డు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు మమ్మల్ని కోర్టు నియమించింది. అలాగే ఆర్థికంగా నష్టపోకుండా మా ప్రయత్నాలు ఉంటాయి’ అని సీఓఏకు నేతృత్వం వహిస్తున్న వినోద్‌ రాయ్‌ తెలిపారు. అలాగే ఆఫీస్‌ బేరర్లు తొమ్మిదేళ్లకంటే ఎక్కువ కాలం పదవులు అనుభవించకూడదని సుప్రీం కోర్టు స్పష్టంగా పేర్కొందని ఆయన తేల్చారు.

డబ్బులున్నా ఇంకా అడుగుతున్నాయి...
తమ బ్యాంకు ఖాతాల్లో దండిగా డబ్బులున్నా ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు పలు రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు నిధులు కావాలని కోరుతున్నాయని వినోద్‌ రాయ్‌ తెలిపారు. సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘం (ఎస్‌సీఏ) బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.250 కోట్లు ఉన్నా కూడా ఐపీఎల్‌ మ్యాచ్‌లను సజావుగా నిర్వహించాలంటే నిధులు కావాలని అడుగుతోందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌పీసీఏ) కూడా తమ దగ్గర రూ.65 కోట్లకు పైగా నిధులున్నా ధర్మశాలలో ఆసీస్‌తో జరిగే చివరి టెస్టు నిర్వహణ కోసం డబ్బులు కావాలని విజ్ఞప్తి చేయడం విచిత్రంగా ఉందని తెలిపారు.

 హెచ్‌పీసీఏకు బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన అనురాగ్‌ ఠాకూర్,  ఎస్‌సీఏకు మాజీ కార్యదర్శి నిరంజన్‌ షా నేతృత్వం వహిస్తుండడం గమనార్హం. గతేడాది మార్చి 31 వరకు ఎస్‌సీఏ ఖాతాలో రూ.213 కోట్లు ఉన్నాయని, అక్టోబర్‌ 31న మరో రూ.42 కోట్లు డిపాజిట్‌ చేశారని సీఓఏ తమ నివేదికలో గుర్తుచేసింది. అయితే సుప్రీం కోర్టు సూచించినట్టుగా లోధా ప్యానెల్‌ సంస్కరణలను అమలు చేయకుండానే నిధులు విడుదల చేయాలని ఆయా క్రికెట్‌ సంఘాలు కోరుతున్నాయంటూ తమ నివేదికలో పేర్కొంది. మరోవైపు సీఓఏకు సొంత లీగల్‌ టీమ్‌ను ఏర్పాటు చేసుకోనీయకుండా సంయుక్త కార్యదర్శి అమితాబ్‌ చౌధరి తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా తెలిపింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా