భారత జట్టుకు భయపడం : బెయిలీ

8 Oct, 2013 02:06 IST|Sakshi
భారత జట్టుకు భయపడం : బెయిలీ

ముంబై: భారత పర్యటనలో మెరుగ్గా రాణించి తిరిగి వన్డేల్లో నంబర్‌వన్ ర్యాంకును దక్కించుకోవాలని  ఆస్ట్రేలియా జట్టు భావిస్తోంది. అలాగే ఈసారి భారత్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. ఐపీఎల్ ద్వారా తమ ఆటగాళ్లకు ఉపఖండ వాతావరణ పరిస్థితులపై అవగాహన ఏర్పడిందని, ఇప్పుడు భారత్ అంటే భయపడాల్సిందేమీ లేదని కెప్టెన్ జార్జి బెయిలీ, కోచ్ స్టీవ్ రిక్సన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈనెల 10న జరిగే ఏకైక టి20 మ్యాచ్‌తో ఆసీస్ భారత పర్యటనను ప్రారంభించనుంది.
 
 ‘జరగబోయే సిరీస్ ద్వారా మేం తిరిగి నంబర్‌వన్ ర్యాంకును చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మాకు ఇది చాలా ముఖ్యం’ అని కోచ్ రిక్సన్ పేర్కొన్నారు. ఐపీఎల్, చాంపియన్స్ లీగ్ టి20ల్లో ఆసీస్ ఆటగాళ్లు కూడా ఆడడం ఈ పర్యటనలో తమకు లాభిస్తుందని కెప్టెన్ బెయిలీ పేర్కొన్నాడు. ‘కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లతో కలిసి ఆడాం. ప్రస్తుతం జట్టులో కొనసాగుతున్న వారితోనూ కలిసి మావాళ్లు ఆడారు. కాబట్టి వారి బలం, బలహీనతల గురించి మాకు తెలుసు. ఇది ఆ జట్టుకు కూడా వర్తిస్తుంది’ అని క్లార్క్ స్థానంలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బెయిలీ తెలిపాడు.
 

మరిన్ని వార్తలు