'శ్రీశాంత్పై నిషేధాన్ని తొలగించం'

18 Apr, 2017 22:33 IST|Sakshi
'శ్రీశాంత్పై నిషేధాన్ని తొలగించం'

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా తనపై విధించిన జీవిత కాల నిషేధాన్ని ఎత్తివేయాలని పోరాడుతున్న క్రికెటర్ శ్రీశాంత్ కు మరోసారి చుక్కెదురైంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అతనిపై కొనసాగుతున్న నిషేధాన్ని తొలగించడం కుదరదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు కేరళ హైకోర్టుకు తన అభిప్రాయాన్ని బీసీసీఐ వెల్లడించింది. శ్రీశాంత్ వ్యవహారంలో తమ మాజీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చలేమని పేర్కొంది.

 

తనపై ఉన్న కేసులను ఢిల్లీలోని సెషన్ కోర్టు కొట్టివేసిన తరువాత బీసీసీఐ కూడా జీవిత కాల నిషేధాన్ని తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిలోభాగంగా హైకోర్టుకు బీసీసీఐ తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ ఓ  నివేదిక సమర్పించింది. ఐపీఎల్ లో  స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2013 మేలో శ్రీశాంత్‌తో పాటు, మరో ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లను అరెస్ట్ చేశారు. ఆ క్రమంలోనే శ్రీశాంత్ పై జీవిత కాల నిషేధాన్ని విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు