ట్రోఫీతోనే స్వదేశానికి..: స్టీవ్ స్మిత్

3 Oct, 2017 11:56 IST|Sakshi

నాగ్ పూర్:తమ క్రికెట్ జట్టు ట్రోఫీతోనే స్వదేశానికి తిరిగి వెళుతుందని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. త్వరలో ఆరంభం కానున్న మూడు ట్వంటీ 20ల సిరీస్ లో తమ ఆటగాళ్లు స్థాయికి తగ్గట్టుగా ఆడి టైటిల్ ను సాధించడంలో సహకరిస్తారనే నమ్మకాన్ని  స్మిత్ పెట్టుకున్నాడు. దీనికి యావత్ జట్టు పూర్తి స్థాయి ప్రదర్శనకు సిద్ధం కావాలని ముందుగానే ఆటగాళ్లను హెచ్చరించాడు.

'ఐదో వన్డే జరిగిన నాగ్ పూర్ వికెట్ పై మూడొందలకు పైగా పరుగులు చేయొచ్చు. కానీ మా బ్యాట్స్ మెన్ పూర్తిగా విఫలమయ్యారు. మా టాపార్డర్-4లో కచ్చితంగా ఒకరు భారీ స్కోరు చేసి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయాం. జట్టులో సమతుకం ఉండాలంటే నిలకడైన ప్రదర్శన అవసరం. వన్డే సిరీస్ ను 1-4 తో కోల్పోవడం నిజంగా బాధాకరం'అని స్మిత్ పేర్కొన్నాడు.

తమ జట్టులో భారత్ లో ఆడిన అనుభవం చాలా మందికి ఉందనే విషయం ఇక్కడ అంగీకరించాల్సిందేనన్నాడు. కాగా, సానుకూల ధోరణితో ఆడితేనే ప్రత్యర్థిపై పైచేయి సాధించే అవకాశం ఉందన్నాడు. ఇక్కడ భారత జట్టును స్మిత్ కొనియాడాడు. ప్రస్తుత భారత జట్టు అత్యంత సమతుల్యంగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. శనివారం నుంచి భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు ట్వంటీ 20 సిరీస్ ఆరంభం కానుంది.

మరిన్ని వార్తలు