బరువు నా బాధ్యత

21 Jan, 2019 07:53 IST|Sakshi
పాలకొండలో లలితారాణికి ఘనస్వాగతం పలుకుతున్న దృశ్యం

కామన్వెల్త్‌లో సత్తా చాటడమే లక్ష్యం

వెయిట్‌లిఫ్టర్‌ లలితారాణి

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో సత్తా చాటిన సిక్కోలు ఆశాకిరణం   

సామాన్య కుటుంబంలో జననం... అసామాన్య రీతిలో గమనం. సాధారణ పల్లెలో సాధన.. అసాధారణ స్థాయిలో పతకాల సాధన. సిక్కోలు ఆశా    కిరణం గార లలితారాణి గమ్యం వైపు దూసుకువెళ్తోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఉత్తరాంధ్రకు ఉన్న గొప్ప పేరును కాపాడుతూనే.. చరిత్ర పుటల్లో తన పేరునూ లిఖించేలా రాణిస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో ద్వితీయస్థానం సాధించి ప్రతిభ చాటింది. కామన్వెల్త్‌లో రాణిస్తానని నమ్మకంగా చెబుతోంది ఈ పాలకొండ యువతి. పతకం సాధించి తిరిగి వచ్చిన లలితారాణికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆమె ఇలా మాట కలిపారు.– పాలకొండ రూరల్‌

సాక్షి: జాతీయ స్థాయి పతకం సాధించడం ఎలాంటి అనుభూతి నిచ్చింది..?
రాణి: ఆనందంగా ఉంది. నా తల్లిదండ్రులు తిరుపతిరావు, చిన్నమ్మడుల ప్రోత్సాహం, కుటుంబసభ్యుల సహకారంతో చిన్నతనం నుండి క్రీడలపై ఆసక్తి కనబర్చాను. తొలి రోజుల్లో ఆడపిల్లలకు బరువులెత్తే ఆటలేంటని ప్రశ్నించిన వారే ఇప్పుడు శభాష్‌ అంటున్నారు. కుటుంబసభ్యులు, కోచ్‌ల ప్రోత్సాహంతో ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది. ఇక్కడి ప్రతిభ కారణంగా ఇతర దేశాల్లో జరగనున్న వరల్డ్‌ యూనివర్సిటీ వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడలకు కూడా ఎంపిక కావడం ఆనందంగా ఉంది.

సాక్షి: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ ప్రయాణం ఎలా సాగింది?
రాణి: గత ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో నిర్వహించిన జూనియర్‌ నేషనల్స్‌లో దేశస్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారిణులు ప్రతిభ కనబర్చారు. నాతో సహా 17 మంది ఈ పోటీల్లో తలపడ్డారు. అందులో రాణించిన వారిని ఖేలో ఇం డియా యూత్‌ గేమ్స్‌కు పంపించారు. అప్పటి నుంచే కఠోరంగా శ్రమించాను.

సాక్షి: జూనియర్‌ నేషనల్స్‌ ఎలా ఉపయోగపడింది?
రాణి: విశాఖ జూనియర్‌ నేషనల్స్‌లో నేను పడిన కష్టం వృధా పోలేదు. నాకు బంగారు పతకంతోపాటు మంచి పేరు, దేశస్థాయి క్రీడల్లో పాల్గొనే అవకాశం కలిగింది.

సాక్షి: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ పోటీలు ఎలా సాగాయి..?
రాణి: ఈ ఏడాది జనవరి 9 నుంచి 15 వరకు మహరాష్ట్ర పూణేలో నిర్వహించిన ఈ క్రీడలకు దేశస్థాయిలో ప్రతిభ గల 21 మంది వెయిట్‌లిఫ్టర్స్‌తో పోటీల్లో తలపడ్డాను. వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారిణులు, వారి శిక్షకులు అనుసరించే విధానాలను దగ్గరగా చూశాను. వారు శ్రమిస్తున్న తీరు నాలో మరింత శక్తి, ఆసక్తి నింపింది.

సాక్షి: బంగారు పతకం చేజార్చుకున్నానన్న బాధ ఉందా..?
రాణి: నాతోపాటు ఈ క్రీడల్లో పోటీ పడిన వారు అందరూ చివరి వరకు తమ ప్రతిభను కనబరిచారు. ఆ సమయంలో నాకు ఆరోగ్యం సరిగా లేదు. జ్వరంతో బాధపడుతున్నా. కేవలం ఒక్క అడుగు దూరంలో బంగారు పథకం దూరమైంది. ఆ సమయంలో కన్నీరు ఆపుకోలేకపోయా. మణిపూర్‌కు చెందిన క్రీడాకారిణికి పథకం వచ్చింది.

సాక్షి: 2018 ఎలాంటి జ్ఞాపకాలు మిగిల్చింది..?
రాణి: 2018 నాకు ఎంతో కలిసి వచ్చిన ఏడాది. ఈ ఏడాదిలో మూడు బం గారు పథకాలతోపాటు బెస్ట్‌ లిఫ్టర్‌గా గుర్తింపు లభించింది. ఆల్‌ ఇండియా స్థాయిలో గుంటూరు నాగార్జున యూనివర్సిటీ క్రీడల్లో, నాగపూర్‌లో జరిగిన జూనియర్‌ నేషనల్స్‌లో, గుంటూరులో జరిగిన సీఎం కప్‌లో బంగారు పథకాలు సాధించా.

సాక్షి: మీ విజయాల్లో ఎవరి సహకారం ఉంది?
రాణి: నా తొలి గురువు నా తండ్రి తిరుపతిరావు. అటుపై నా శిక్షకులు ఎస్‌ఏ.సింగ్, పి.మాణిక్యాలరావు, ఎం.రామకృష్ణలు ఎంతగానో ప్రోత్సహించి శిక్షణ అందించారు. ప్రస్తుతం నాకు కాకినాడకు చెందిన ఎన్‌సీ.మోహన్‌ శిక్షణ అందిస్తున్నారు. అలాగే మా బావగారు రామకృష్ణ సహకారం మరిచిపోలేనిది.

సాక్షి: మీ భవిష్యత్‌ లక్ష్యాలు..?
రాణి: నా కుటుంబంలో నాతోపాటు మా అక్కలు అరుణరాణి, ఉషారాణిలుకూడా వెయిట్‌లిఫ్టర్లు కావటంతో వారి సహకారం ఉంది. ఉన్నత చదువులతోపాటు రానున్న కామన్వెల్త్‌ క్రీడల్లో సత్తాచాటాలనేది నా లక్ష్యం. నా తల్లిదండ్రులు నాపై ఉంచిన నమ్మకం వృధా కానివ్వను.  

సాక్షి: ప్రస్తుతం క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహం ఉంది?
రాణి: సౌకర్యాలు లేకున్నా కష్టపడి లక్ష్య సాధనవైపు దూసుకువేళ్లే క్రీడాకారులకు జిల్లాలో కొదువ లేదు. ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం. ముఖ్యం గా క్రీడాకారులకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. వారిలో నేను కూడా ఉన్నా. మధ్య తరగతి కుటుంబం మాది. అధికారుల సహకారం అవసరముంది.

సాక్షి: నేటితరం క్రీడాకారులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
రాణి: ఆసక్తి ఉన్న క్రీడాకారులు ముందుకురావాలి. నిరుత్సాహం విడనాడాలి. వారికి కుటుంబ సభ్యులతోపాటు అందరూ సహకరించాలి. నచ్చిన రంగంలో ఉన్నత స్థానం దక్కించుకునేందుకు నిరంతరం కృషి చేయాలి.

మరిన్ని వార్తలు