ప్రదీప్‌... కొత్త రకం డోపీ

16 Jul, 2020 01:15 IST|Sakshi
ప్రదీప్‌ సింగ్‌

హెచ్‌జీహెచ్‌కు పాల్పడిన వెయిట్‌లిఫ్టర్‌

భారత్‌లో ఇదే తొలిసారి

నాలుగేళ్ల నిషేధం విధించిన సమాఖ్య  

న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో కుదుపు! 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో 105 కేజీల విభాగంలో రజత పతకం నెగ్గిన భారత వెయిట్‌లిఫ్టర్‌ ప్రదీప్‌ సింగ్‌ సరికొత్త డోపింగ్‌కు పాల్పడ్డాడు. హ్యూమన్‌ గ్రోత్‌ హార్మోన్‌ (హెచ్‌జీహెచ్‌) డోపింగ్‌లో ఈ పంజాబ్‌ లిఫ్టర్‌ దొరికిపోయాడు. ఈ హెచ్‌జీహెచ్‌ కేసు ప్రపంచానికి ముందే పరిచయమైనా... భారత్‌లో ఇదే తొలి కేసు. జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) పరీక్షల్లో లాక్‌డౌన్‌కు ముందే మార్చిలో పట్టుబడినప్పటికీ ‘బి’ శాంపిల్‌తో ధ్రువీకరించుకున్న తర్వాత ‘నాడా’ తాజాగా వెల్లడించింది.

అథ్లెట్లు అత్యంత అరుదుగా ఈ తరహా మోసానికి పాల్పడతారు. ఇది మామూలు ఉత్ప్రేరకం కాదు. మెదడులోని గ్రంథి స్రావాల ద్వారా ఉత్తేజితమయ్యే ఉత్ప్రేరకం. రైల్వేస్‌కి చెందిన వెయిట్‌లిఫ్టర్‌ ప్రదీప్‌ హెచ్‌జీహెచ్‌కు పాల్పడినట్లు తేలడంతో భారత వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య నాలుగేళ్ల నిషేధం విధించింది. దీనిపై ‘నాడా’ డైరెక్టర్‌ నవీన్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ‘ఇలాంటి డోపింగ్‌ కేసు మన దేశంలో మొదటిది. మార్చిలోనే సంబంధిత సమాఖ్యకు సమాచారమిచ్చాం.

నిజానికి పోటీల్లేని సమయంలో డిసెంబర్‌లో అతని నుంచి నమూనాలు సేకరించాం. ‘వాడా’ గుర్తింపు పొందిన ‘దోహా’ ల్యాబ్‌కు పంపి పరీక్ష చేయగా దొరికిపోయాడు’ అని తెలిపాడు. ఫిబ్రవరిలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో ప్రదీప్‌ 102 కేజీల కేటగిరీలో పాల్గొని స్వర్ణం గెలిచాడు. మార్చిలో డోపింగ్‌లో దొరికిన వెంటనే ‘నాడా’ ఇచ్చిన సమాచారం మేరకు భారత వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య అతన్ని శిబిరం నుంచి తప్పించింది.
హెచ్‌జీహెచ్‌ అంటే...
కొన్ని రకాల మెడిసిన్‌ ద్వారా హెచ్‌జీహెచ్‌ శరీరంలోకి ఉత్పత్తి అవుతుంది. మానవ శరీరాన్ని అత్యంత చాకచక్యంగా ఉత్తేజితం చేస్తుంది. ఎముక, ఇతర దెబ్బతిన్న అవయ వం పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఎముకశక్తిని పటిష్టపరుస్తుంది. కండరాల సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతర్జాతీయ డోపిం గ్‌ నిరోధక సంస్థ (వాడా) ప్రకారం 2010 నుంచి ఈ తరహా డోపింగ్‌కు పాల్పడింది కేవలం 15 మందే. ఇందులో ఇద్దరు లండన్‌ ఒలింపిక్స్‌ సమయంలో దొరికిపోయారు.   

మరిన్ని వార్తలు