‘గంభీర్‌ కోల్‌కతా టీమ్‌లో లేడా!’

17 Apr, 2018 10:54 IST|Sakshi

కోల్‌కతా: ఐపీఎల్‌ 2018లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌-ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో దాదాపు అందరి దృష్టీ గౌతం గంభీర్‌పైనే! కేకేఆర్‌కు ఏడేళ్లపాటు నాయకత్వం వహించి, రెండు సార్లు జట్టును విజేతగా నిలబెట్టిన అతను అనూహ్య పరిణామాల మధ్య ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు మారిపోవడం, అసలే ఆవేశపరుడిగా పేరుపొందిన గౌతీ.. ఈ సీజన్‌లో తొలిసారి ఈడెన్‌కు ప్రత్యర్థిగా రావడాన్ని ఎలా ఫీలై ఉంటాడు? అభిమానుల మనసుల్లో మెదిలిన ఈ ప్రశ్నలనే కామెంటేటర్లు కూడా అడిగారు. అయితే గంభీర్‌ మాత్రం చాలా కూల్‌గా.. ‘అవును. నిన్నటిదాకా ఇదే(కోల్‌కతాయే) నా ఇల్లు. గతంలో ఈ జట్టు తరఫున నేనేదైనా సాధించానంటే అది విశ్వసనీయులైన కేకేఆర్‌ అభిమానుల మద్దతుతోనే అన్నది వాస్తవం. ఆ విషయం ఎప్పటికీ మర్చిపోలేను’ అని సమాధానమిచ్చాడు. ఇదే ప్రశ్న సునీల్‌ నరైన్‌ను అడిగినప్పుడు కొద్దిగా ఎమోషనల్‌ అయ్యాడు.

సునీల్‌ నరైన్‌ అరుదైన రికార్డు: గడిచిన ఏడేళ్లుగా కోల్‌కతా నైట్‌రైడర్స​కు ప్రాతినిధ్యం వహిస్తోన్న మ్యాజిక్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సాధించాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు పగడొట్టిన అతడు 100 వికెట్ల క్లబ్‌లోకి ప్రవేశించాడు. కెరీర్‌లో 86 మ్యాచ్‌లు ఆడిన నరైన్‌ 102 వికెట్లను పగడొట్టాడు. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన 11వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 154 వికెట్లతో లసిత్‌ మలింగా ఈ జాబితాలో తొలిస్థానంలో ఉన్నాడు.  

గంభీర్‌ కోల్‌కతాలో లేడా: మ్యాచ్‌ అనంతరం సునీల్‌ నరైన్‌ కామెంటేటర్లతో మాట్లాడాడు. ‘‘ గంభీర్‌ మా(కోల్‌కతా) జట్టుకాదా, మా ప్రత్యర్థా! ఈ విషయాన్ని జీర్ణించుకోవడం నాకైతే కష్టమైంది. కేకేఆర్‌ కోసం ఇద్దరం మనసుపెట్టి ఆడేవాళ్లం. గుండెలనిండా జట్టును గెలిపించాలనే కసి. కానీ ఇప్పుడు మా ఇద్దరివీ వేర్వేరు టీమ్‌లు. ఏం చేస్తాం, క్రికెట్‌లో ఇదంతా సహజమే కదా!’’ అని నరైన్‌ చెప్పాడు. తాను ఇప్పటికీ నూరుశాతం పరిపూర్ణ స్పిన్నర్‌ను కానని, అయితే మిగతావారికంటే ఎంతో కొంత వైవిధ్యాన్ని ప్రదర్శిస్తానని, జట్టు అవసరాలకు తగ్గట్టు నడుచుకుంటానని తెలిపాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగిన నైట్‌రైడర్స్‌ 71 పరుగుల తేడాతో జయభేరి మోగించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు