చెలరేగిన భువనేశ్వర్

13 Aug, 2016 02:45 IST|Sakshi
చెలరేగిన భువనేశ్వర్

తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 225 ఆలౌట్
భారత్‌కు 128 పరుగుల ఆధిక్యం


గ్రాస్ ఐలెట్: భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ (5/33) ధాటికి వెస్టిండీస్ జట్టు కుప్ప కూలింది. ఓ దశలో టాపార్డర్ రాణింపుతో పటిష్టంగా కనిపించినా... 23 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 103.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటయింది. బ్రాత్‌వైట్ (163 బంతుల్లో 64; 6 ఫోర్లు), మార్లన్ శామ్యూల్స్ (109 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతావారు విఫలమయ్యారు. అశ్విన్‌కు రెండు, ఇషాంత్, జడేజాలకు ఒక్కో వికెట్ దక్కింది. భారత్‌కు 128 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.


107/1 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు శుక్రవారం ఆట ప్రారంభించిన విండీస్ ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. బ్రావోను ఇషాంత్ అవుట్ చేయగా మరో మూడు ఓవర్ల అనంతరం అశ్విన్ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో మార్లన్ శామ్యూల్స్, బ్లాక్‌వుడ్ (86 బంతుల్లో 20; 1 ఫోర్) సమయోచితంగా ఆడారు. ముఖ్యంగా జడేజా, అశ్విన్ బౌలింగ్‌లో శామ్యూల్స్ ఎదురుదాడికి దిగి పరుగులు సాధించాడు. వీరిద్దరి ఆటతీరుతో నాలుగో వికెట్‌కు 67 పరుగులు జతచే రాయి. అయితే లంచ్ విరామానంతరం పేసర్ భువనేశ్వర్ విండీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను వణికించాడు. చివరి ఏడు వికెట్లలో ఐదు భువనేశ్వరే తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్... కడపటి వార్తలు అందే సమయానికి... 2 ఓవర్లలో 8 పరుగులు చేసింది.

 
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 353

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: బ్రాత్‌వైట్ (సి) సాహా (బి) అశ్విన్ 64; జాన్సన్ (రనౌట్) 23; డారెన్ బ్రావో (సి) జడేజా (బి) ఇషాంత్ 29; శామ్యూల్స్ (బి) భువనేశ్వర్ 48; బ్లాక్‌వుడ్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 20; చేజ్ (సి) రహానే (బి) జడేజా 2; డౌరిచ్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 18; హోల్డర్ ఎల్బీడబ్ల్యు (బి) భువనేశ్వర్ 2; జోసెఫ్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 0; కమ్మిన్స్ (సి) సాహా (బి) అశ్విన్ 0; గాబ్రియల్ నాటౌట్ 0; ఎక్స్‌టాలు 19; మొత్తం (103.4 ఓవర్లలో ఆలౌట్) 225.


వికెట్ల పతనం: 1-59, 2-129, 3-135, 4-202, 5-203, 6-205, 7-212, 8-212, 9-221, 10-225.
బౌలింగ్: భువనేశ్వర్  23.4-10-33-5; షమీ 17-3-58-0; అశ్విన్ 26-7-52-2; ఇషాంత్ 13-2-40-1; జడేజా 24-9-27-1.

 

మరిన్ని వార్తలు