విండీస్ వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి..

8 Apr, 2017 19:14 IST|Sakshi
విండీస్ వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి..

గయానా:వెస్టిండీస్ క్రికెట్ జట్టు తన వన్డే చరిత్రలో సరికొత్త మైలురాయిని సాధించింది.  తొలిసారి వన్డే క్రికెట్ లో మూడొందల పరుగులకు పైగా  లక్ష్యాన్ని ఛేదించి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా పాకిస్తాన్ తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 309 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. తద్వారా విండీస్ వన్డే క్రికెట్ చరిత్రలో మూడొందలకు పైగా లక్ష్యాన్ని తొలిసారి ఛేదించినట్లయ్యింది. అంతకుముందు 44 ఏళ్ల తన వన్డే క్రికెట్ చరిత్రలో 31 సార్లు మూడొందలకు పైగా లక్ష్యాన్ని ఛేదించడంలో వెస్టిండీస్ విఫలమైంది. 2004లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో విండీస్ లక్ష్యాన్ని ఛేదిస్తూ 300 పరుగులు చేసింది. అయితే అక్కడ విండీస్ కు నిర్దేశించబడిన లక్ష్యం 298 పరుగులు మాత్రమే.


తాజా మ్యాచ్ లో పాక్ విసిరిన 309 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్  ఓపెనర్ ఎడ్ లూయిస్(47) మంచి ఆరంభానివ్వగా, మిడిల్ ఆర్డర్ ఆటగాడు కీరన్ పావెల్(61) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత జాసన్ మొహ్మద్(91 నాటౌట్;58 బంతుల్లో 11 ఫోర్లు,3 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. పాకిస్తాన్ బౌలింగ్ ను చీల్చి చెండాడుతూ మెరుపు బ్యాటింగ్ చేశాడు.అతనికి ఆష్లే నర్స్(34 నాటౌట్; 15 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి సహకారం అందివ్వడంతో విండీస్ ఇంకా ఓవర్ మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దాంతో సరికొత్త రికార్డును లిఖించింది.

 

>
మరిన్ని వార్తలు