ఎవర్టన్‌ వీక్స్‌ కన్నుమూత

3 Jul, 2020 00:02 IST|Sakshi

ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలిచిన వెస్టిండీస్‌ దిగ్గజం

చెక్కుచెదరని వరుస సెంచరీల రికార్డు 

ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఐదు టెస్టు సెంచరీలు... 143 ఏళ్ల టెస్టు చరిత్రలో కేవలం ఒకే ఒక్క ఆటగాడికి ఇది సాధ్యమైంది. ఈ ఘనత సాధించిన వెస్టిండీస్‌ దిగ్గజం ‘సర్‌’ ఎవర్టన్‌ వీక్స్‌ తన జీవితపు ఆటను ముగించారు. మరో శతకానికి చేరువగా వచ్చి 95 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 40వ, 50వ దశకాల్లో విండీస్‌ క్రికెట్‌ వీర విజయాల్లో బ్యాట్స్‌మన్‌గా కీలక పాత్ర పోషించిన వీక్స్‌ ప్రపంచ క్రికెట్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకరిగా నిలిచారు. ప్రతిష్టాత్మక బ్యాటింగ్‌ త్రయం ‘3 డబ్ల్యూస్‌’లో ఆయన ఒకరు.

బ్రిడ్జ్‌టౌన్‌ (బార్బడోస్‌):  వెస్టిండీస్‌ నాటితరం టాప్‌ బ్యాట్స్‌మన్‌ ఎవర్టన్‌ డి కార్సీ వీక్స్‌ బుధవారం మృతి చెందారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. 1948నుంచి 1958 మధ్య కాలంలో వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించిన వీక్స్‌ 15 సెంచరీలు, 19 అర్ధ సెంచరీలు సహా 4455 పరుగులు చేశారు. ఆయన టెస్టు బ్యాటింగ్‌ సగటు (58.61) ఆల్‌టైమ్‌ జాబితాలో టాప్‌–10లో ఉండటం విశేషం. అత్యంత వేగంగా 12 ఇన్నింగ్స్‌లలోనే 1000 పరుగులు సాధించిన వీక్స్‌ శైలిని నాటితరం బ్రాడ్‌మన్‌తో పోల్చేది. అటాకింగ్‌ స్ట్రోక్‌లతో పాటు చక్కటి ఫుట్‌వర్క్‌తో దశాబ్దకాలం పాటు వీక్స్‌ క్రికెట్‌ ప్రపంచంపై తనదైన ముద్ర వేశారు. కటిక పేదరికంలో పుట్టిన వీక్స్‌ బాల్యంలో బాగా ఇబ్బందులు పడ్డారు. తెల్లవారికే అనుమతి ఉండటంతో స్థానిక క్లబ్‌లలో ఆయన క్రికెట్‌ ఆడటాన్ని నిషేధించినా... కేవలం తన సత్తా, పట్టుదలతో ఆయన అందరి దృష్టిలో పడ్డారు.

23 ఏళ్ల వయసులో తొలి టెస్టు ఆడిన వీక్స్‌... తొడ గాయం కారణంగా 33 ఏళ్ల వయసుకే ఆటకు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. 1951లో ‘విజ్డన్‌’ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలిచిన ఆయనకు ‘ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో కూడా చోటు దక్కింది. క్రికెట్‌కు వీక్స్‌ చేసిన సేవలకు 1995లో నైట్‌హుడ్‌ పురస్కారం దక్కడంతో ఆయన పేరు పక్కన ‘సర్‌’ చేరింది. రిటైర్మెంట్‌ తర్వాత ఐసీసీ మ్యాచ్‌ రిఫరీగా, కోచ్‌గా కూడా వీక్స్‌ పని చేశారు. ఆయన కుమారుడు డేవిడ్‌ ముర్రే విండీస్‌ తరఫున 10 టెస్టులు, 10 వన్డేలు ఆడాడు. వీక్స్‌ మరణం పట్ల అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు క్రికెటర్లు ఆయన ఘనతలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు.

సెంచరీల జోరు... 
ఎవర్టన్‌ వీక్స్‌ తన తొలి 3 టెస్టుల్లో కలిపి 152 పరుగులు మాత్రమే చేశారు. అయితే కింగ్‌స్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తర్వాతి టెస్టులో సాధించిన సెంచరీలతో ఆయన అద్భుత ప్రయాణం కొత్త మలుపు తీసుకుంది. ఈ మ్యాచ్‌లో వీక్స్‌ 141 పరుగులు చేశారు. ఆ తర్వాత జరిగిన భారత పర్యటనలో ఈ జోరు కొనసాగిస్తూ వరుసగా మరో నాలుగు సెంచరీలు సాధించారు. ఈ సిరీస్‌లో తొలి మూడు టెస్టుల్లో 128, 194, 162, 101 పరుగులు చేయడంతో వరుసగా ఐదు శతకాల రికార్డు నమోదైంది. 1948లో సాధించిన ఈ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఆయన పేరిటే ఉండటం విశేషం. ఇందులో చివరి రెండు కలకత్తాలో జరిగిన ఒకే టెస్టులో వచ్చాయి. ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో నమోదైన తొలి సెంచరీ కూడా ఇదే. మద్రాసులో జరిగిన తర్వాతి టెస్టులో వీక్స్‌ 90 పరుగుల వద్ద అంపైర్‌ తప్పుడు నిర్ణయంతో రనౌటయ్యారు. లేదంటే అది ఆరో సెంచరీ అయి ఉండేది! ఈ సిరీస్‌లో 111.28 సగటుతో ఆయన మొత్తం 779 పరుగులు సాధించారు.

ముగ్గురు మొనగాళ్లు... 
సర్‌ క్లయిడ్‌ వాల్కాట్, సర్‌ ఫ్రాంక్‌ వారెల్, సర్‌ ఎవర్టన్‌ వీక్స్‌ కలిసి వెస్టిండీస్‌ విఖ్యాత బ్యాటింగ్‌ త్రయం ‘3 డబ్ల్యూస్‌’గా గుర్తింపు పొందారు. భీకర పేస్‌కు తోడు ఈ ముగ్గురి బ్యాటింగ్‌ జట్టుకు గొప్ప విజయాలు అందించింది. బార్బడోస్‌లోనే 18 నెలల వ్యవధిలో పుట్టిన ఈ ముగ్గురు మూడు వారాల వ్యవధిలోనే విండీస్‌ తరఫున అరంగేట్రం చేయడం విశేషం. ఈ ముగ్గురికి పురుడు పోసింది కూడా ఒకే మహిళ అనే ప్రచారం కూడా ఉంది. ఫ్రాంక్‌వారెల్‌ ల్యుకేమియాతో 1967లోనే చనిపోగా, వాల్కాట్‌ 2006లో మరణించారు. వీరిలో ఇద్దరు బతికుండగానే బ్రిడ్జ్‌టౌన్‌లో ఈ ముగ్గురి పేరిట ఆంగ్ల అక్షరం ‘గి’ రూపంలో స్మారకం ఏర్పాటు చేయడం మరో ఆసక్తికర అంశం. మిగతా ఇద్దరి సమాధులు ఉన్న చోటనే వీక్స్‌ను కూడా ఖననం చేయనున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా