17 ఏళ్ల తర్వాత విండీస్‌ మరో రికార్డు

22 Dec, 2019 18:00 IST|Sakshi

కటక్‌: టీమిండియాతో జరుగుతున్న చివరి వన్డేలో వెస్టిండీస్‌ బ్యాటింగ్‌లో సత్తాచాటింది. భారత్‌కు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధానంగా పూరన్‌(89; 64 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), పొలార్డ్‌(74 నాటౌట్‌; 51 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు)లు ధాటిగా ఆడి భారత్‌కు సవాల్‌ విసిరారు. అయితే వీరిద్దరూ ఒక రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు.  ఐదో వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి విండీస్‌ మూడొందల స్కోరును సునాయాసంగా దాటడంలో సహకరించారు. కాగా, తాజాగా పూరన్‌-పొలార్డ్‌లు సాధించిన 135 పరుగుల భాగస్వామ్యమమే భారత్‌పై విండీస్‌కు అత్యధిక ఐదో వికెట్‌ భాగస్వామ్యంగా నమోదైంది. దాంతో 17 ఏళ్ల రికార్డును పూరన్‌-పొలార్డ్‌లు తుడిచిపెట్టేశారు.  2002లో శామ్యూల్స్‌-పావెల్‌లు ఐదో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని భారత్‌పై సాధించగా, దాన్ని పూరన్‌-పొలార్డ్‌లు జోడి బద్ధలు కొట్టింది. 17 ఏళ్ల తర్వాత విండీస్‌ తరఫున ఈ ఘనతను పొలార్డ్‌-పూరన్‌లు తిరగరాశారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో విండీస్‌ బ్యాటింగ్‌ను లూయిస్‌, హోప్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 57 పరుగుల  జత చేసిన తర్వాత లూయిస్‌ ఔట్‌ కాగా, కాసేపటికి హోప్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. లూయిస్‌ను  జడేజా పెవిలియన్‌కు పంపగా, హోప్‌ను మహ్మద్‌ షమీ ఔట్‌ చేశాడు. ఆపై రోస్టన్‌ ఛేజ్‌కు హెట్‌మెయిర్‌ జత కలిశాడు. ఈ జోడి 62 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత సైనీ బౌలింగ్‌లో హెట్‌మెయిర్‌ ఔటయ్యాడు.. మరో 12 పరుగుల వ‍్యవధిలో చేజ్‌ను సైతం సైనీ  బౌల్డ్‌ చేశాడు. ఆ తరుణంలో నికోలస్‌ పూరన్‌కు జత కలిసిన పొలార్డ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. స్లాగ్‌ ఓవర్లలో ఈ జోడి ధాటిగా ఆడింది. బౌండరీలే లక్ష్యంగా చెలరేగింది. 

ఫలితంగా స్కోరు బోర్డు పరుగులు తీసింది. ప్రధానంగా పూరన్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత రెచ్చిపోయి ఆడాడు. అతనికి పొలార్డ్‌ నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ చక్కటి సమన్వయంతో విండీస్‌ స్కోరును గాడిలో పెట్టారు. కాగా, శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 48 ఓవర్‌ ఐదో బంతికి భారీ షాట్‌కు యత్నించిన పూరన్‌ ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత హోల్డర్‌ క్రీజ్‌లోకి రాగా, పొలార్డ్‌ బ్యాట్‌ ఝుళిపించి ఆడాడు. చివరి పది ఓవర్లలో విండీస్‌ 118 పరుగుల్ని సాధించడం విశేషం. 

మరిన్ని వార్తలు